ఉత్తరాఖండ్ సిఎం ధామీ వెల్లడి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్ కుప్పకూలి అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే చర్యలు తుది దశలో ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. ఈనెల 12న సొరంగం కూలిపోయి 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 13 రోజుల పాటు కార్మికులు అందులోనే భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు. అయితే, కార్మికులను రక్షించే క్రమంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. డ్రిల్లింగ్ పనులకు గుర్తు తెలియని ఇనుప పట్టీ తాకటం, దానిని గ్యాస్ కట్టర్‌తో తొలగించాక పనులు మళ్లీ మొదలు కావటం జరిగాయి. ఇలాంటి అవాంతరాలు, అంతరాయాల నేపథ్యంలో కార్మికుల కోసం బోర్డ్ గేమ్స్, పేక ముక్కలను రెస్క్యూ టీమ్‌లు అందిస్తున్నాయి.’లూడో, చెస్ బోర్డు, పేకముక్కలు వంటి వాటిని చిక్కుకున్న కార్మికులకు అందించాలనుకుంటున్నాం. దీంతో వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆపరేషన్ ఆలస్యమవుతున్నది. ఇందుకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తున్నది” అని ఘటనా స్థలం వద్ద ఉన్న ఒక మానసిక వైద్యులు డాక్టర్ రోహిత్ గోన్‌డ్వాల్ తెలిపారు. కాగా, అంతకముందు మధ్యాహ్నం సమయంలో సిల్క్యారా టన్నెల్ సైట్ వద్ద కొనసాగుతున్న రక్షణ చర్యలను పర్యవేక్షించటానికి కేంద్ర మంత్రి వి.కె సింగ్ అక్కడకు చేరుకున్నారు.