న్యూఢిల్లీ: సుమారు ఆరు నెలల నుంచి హింసాకాండ కొనసాగుతున్న మణిపుర్‌లో శాంతి పునరుద్ధరణలో కీలక పరిణామం చోటుచేసుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు. శాంతి ఒప్పందంపై యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్) సంతకం చేసిందని వెల్లడిచారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతి చర్చలు ఫలప్రదంగా ముగిశాయని సోషల్ మీడియా వేదికగా అమిత్ షా ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్) శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని తెలిపారు. మణిపూర్‌లోని సాయుధ గ్రూపుగా వున్న యుఎన్‌ఎల్‌ఎఫ్ హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అంగీకారం తెలిపిందని చెప్పారు. వీరిని ప్రజాస్వామ్య ప్రక్రియలోకి స్వాగతిస్తున్నానని.. శాంతి, అభివృద్ధి మార్గంలో వీరి ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు తుపాకీలు వీడిన ఫొటోలను అమిత్ షా షేర్ చేసుకున్నారు. మే 3 నుంచి మణిపూర్‌లో హంసాకాండా రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ తమ ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతోందని మీడియాకు వెల్లడించారు. అయితే మిగతా వివరాలను మాత్రం వెల్లడించలేదు.