జైపూర్ : అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి వస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన సర్దార్‌పురాలో ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల సందర్భంగా మోడీ చేసిన ప్రసంగాల్ని వింటే.. వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి. పొంతన లేకుండా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక. మోడీ ఎన్నిక కాదు. మేం ఇక్కడే ఉంటాం. అభివృద్ధి గురించి మాట్లాడతాం. ఈ రాష్ట్రలో మళ్లీ కాంగ్రెస్‌నే అధికారంలోకి వస్తుంది. మరో ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలిస్తుంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్రంలో బిజెపి వాళ్లు కనిపించరు. ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రజలకిచ్చిన ఏడు హామీలు మమ్మల్ని గెలిపిస్తాయి.’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ సందర్భంగా గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఓడిపోతామని తెలిసి బిజెపి ఉలిక్కిపడుతోంది.’ అని అన్నారు.