శాసన తయారీకి అడ్డుపడడమే పనా!
ఇటువంటి చర్యలను అనుమతించం
కేరళ గవర్నర్‌కు సుప్రీం సీరియస్ వార్నింగ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ శాసనసభ ఆమోదించిన బిల్లులను ఏళ్ల తరబడి తొక్కిపట్టిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ చర్యను సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. శాసన తయారీ ప్రక్రియను పాజ్ చేసే అధికారం గవర్నరకు లేదని స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలను ఎంతమాత్రం అనుమతించబోమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. విచారణ జరగడానికి ముందు రోజు గవర్నరు ఒక బిల్లును ఆమోదించి, మిగతా ఏడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు నివేదించారని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బుధవారం కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ”రెండేళ్లుగా గవర్నర్ ఏం చేస్తున్నారు? బిల్లులు ఎందుకు నిలిపిఉంచారు?. ఇంతకాలం పాటు బిల్లులను తొక్కిపట్టడానికి కారణం ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవడంతో బిల్లులను రాష్ట్రపతికి పంపారు. చట్టాలను రూపొందించే శాసనసభల అధికారాల్లో జోక్యం చేసుకునే విధంగా గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేయరాదు. గవర్నర్‌కు రాజ్యాంగ బాధ్యత ఉంది. అది నెరవేరలేదని తేలితే కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రజలే మనల్ని అడుగుతారు” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్ర అసెంబ్లీ అమోదించిన బిల్లులకు అంగీకారం తెలపకుండా గవర్నర్ ఉద్దేశపూర్వకం గానే జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వ తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం, బిల్లులపై గవర్నర్లు నిర్ణయాలు తీసుకునే విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. గవర్నర్ తీరులో మార్పు రాకుంటే ఆయనకు మార్గదర్శకాలు జారీ చేసేందుకు వెనుకాడబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ప్రస్తుత పిటిషన్‌లో అలాంటి జోక్యమేమీ కుదరదు కాబట్టి పిటిషన్‌కు అవసరమైన సవరణలు సమర్పించాలని కేరళను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలు పాటించకుండా గవర్నర్ బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని, అందుకు ఎలాంటి కారణం కూడా చెప్పలేదని తెలిపారు. గవర్నరు తొక్కిపట్టినవాటిలో మనీ బిల్లు ఒకటి ఉందని కేకే వేణుగోపాల్ వివరించారు. దీంతో ఆ మనీ బిల్లుపై గవర్నరు వెంటనే నిర్ణయం తీసుకునేలా చూస్తానని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని మధ్యంతర ఉత్తర్వుల్లో నమోదు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.