విజయవాడ : ఏప్రిల్ , అక్టోబర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్) జోన్‌లో సుమారు 15.75 కోట్ల మంది ప్రయాణించారు. వారిలో 90 కంటే ఎక్కువ మంది స్లీపర్, జనరల్ బోగీలలో ప్రయాణించినట్లు తెలిపింది. రైల్వే అధికారులు శుక్రవారం ఓ నివేదిక విడుదల చేశారు. నాన్ ఎసి కోచ్‌లలో ప్రయాణించే వారిసంఖ్య గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. గడిచిన ఏడునెలలో ఈ మొత్తం ప్రయాణికుల్లో 14.32 కోట్ల మంది స్లీపర్, జనరల్ బోగీలలో ప్రయాణించగా, 1.43 కోట్ల మంది ఎసి కోచ్‌లలో ప్రయాణించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఎసికోచ్ ప్రయాణికుల సంఖ్య 27 లక్షలు పెరగగా, నాన్ ఎసి కోచ్‌ల ప్రయాణికుల సంఖ్య 1.01 కోట్లకు పెరిగింది.
ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో అత్యధిక డిమాండ్ కలిగిన ఈ రూట్‌లను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని ఎస్‌సిఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సిపిఆర్‌ఒ) రాకేష్ తెలిపారు. ఎసిఈ జోన్‌లోని వివిధ ప్రాంతాల నుండి రోజుకి 664 రైళ్లు నడిపామని చెప్పారు. 664రైళ్లలో 349 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగా, 209 పాసింజర్ ప్రత్యేక ట్రైన్స్, 106 మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటిఎస్) ట్రైన్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ జోన్‌లో ప్రత్యేక రైళ్లను నడపడానికి, బోగీలను పెంచడానికి మరియు రైలు సేవలను విస్తరించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
జాతీయ స్థాయిలో భారతీయ రైల్వే రోజుకి 10,748 రైళ్లను నడుపుతుండగా వాటిలో 372 కోట్ల మంది ప్రయాణికులు జనరల్, స్లీపర్ కోచ్‌లలో ప్రయాణిస్తున్నారు. 18.2 కోట్ల మంది ప్రయాణికులు ఎసి కోచ్‌లలో ప్రయాణిస్తున్నట్లు సిపిఆర్‌ఒ తెలిపింది.