ఫిబ్రవరి 1న చెన్నైలో ఐక్య ర్యాలీ
మోడీ సర్కార్‌ను గద్దె దించాలి
ఎన్‌ఇపిని తిప్పికొట్టాలి
16 విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :”బిజెపి, ఆరెస్సెస్ దాడుల నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని, తిరోగమనంతో కూడిన జాతీయ విద్యా విధానాన్ని తిప్పికొట్టాలని కోరుతూ జనవరి 12న పార్లమెంటు మార్చ్‌కు ఎస్‌ఎఫ్‌ఐ సహా 16 విద్యార్థి సంఘాల ఐక్య కార్యా,చరణ కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నేతలు ఈ విషయం వెల్లడించారు. మొదట ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ మాట్లాడుతూ క్యాంపస్‌లు పోరాట కేంద్రాలుగా నిలుస్తాయన్నారు.. కాషాయీకరణే ధ్యేయంగా అమలు చేస్తున్న ఎన్‌ఇపిని వెనక్కి తీసుకోవాలని, నీట్ పరీక్షలను ఉపసంహరించుకోవాలని, విద్య, ఉపాధి హామీ కోసం భగత్‌సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రోహిత్ వేముల’ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కుల వివక్షను అంతం చేయడానికి, అన్ని క్యాంపస్‌లలో బాలికలపై హింసను నిరోధించడానికి జిఎస్ క్యాస్ ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల మంది విద్యార్థులు పార్లమెంటుకు పాదయాత్ర నిర్వహిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 1న చెన్నైలో ఐక్య ర్యాలీ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలను కలిసి విద్యార్థి ఫ్రంట్ డిమాండ్లను ‘ఇండియా’ కూటమి ఎన్నికల ఎజెండాలో చేర్చాలని కోరనున్నట్లు తెలిపారు. విద్యార్థుల మార్చ్‌ను అడ్డుకునేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, ఏది ఏమైనా తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
2025లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది పూర్తి చేసుకోనుందని, సంఫ్‌ుపరివార్ దాడులకు గురవుతున్న దేశ ప్రజాస్వామ్య లౌకిక విలువలు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు విద్యార్థులు సంఘటిత శక్తిగా మారాలని ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి దినేశ్ సీరంగరాజ్ పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో డిఎంకె విద్యార్థి విభాగం కార్యదర్శి, కాంచీపురం ఎమ్మెల్యే సివిఎంపీ ఎజిఅరసన్, ఏఐఎస్‌ఏ అధ్యక్షుడు నీలాశిష్ బోస్, ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి నితీశ్ గౌర్, ఏఐఎస్‌బీ కన్వీనర్ సౌమ్యదీప్ సర్కార్, సీఆర్జేడీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక భారతి, సివైఎస్‌ఎస్ జాతీయ కోఆర్డినేటర్ అనురాగ్ నిగమ్, ద్రవిడియన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎస్. ప్రిన్స్ ఎన్నారీస్ పెరియర్, డిఎస్‌ఎఫ్ కార్యదర్శి అన్ఘా ప్రదీప్, గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సుజిత్ త్రిపుర, జెఎన్ యుఎస్ యు అధ్యక్షురాలు ఐషీఘోష్, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు దీప్షీతాదార్, నితీష్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.