ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఖాళీగా ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను భర్తీ చేయడానికి నీట్ పిజి ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్-2023 నిర్వహించనున్నట్లు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసిసి) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని కోసం రిజిస్ట్రేషన్లను ఎంసిసి.ఎన్‌ఐసి.ఐఎన్ అనే తన అధికారిక వైబ్‌సైట్‌లో శుక్రవారం నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. రిజిస్ట్రేషన్లకు తుది గడువు ఈ నెల 22గా ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 22 వరకూ అభ్యర్థులు తమకు నచ్చిన సెక్షన్లను లాక్ చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు ఫలితాలను ఈ నెల 24న ప్రకటిస్తారు. ఈ నెల 25 నుంచి 30 లోపు విద్యార్థులు తమకు కేటాయించిన సంస్థల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని ఎంసిసి పేర్కొంది. 2023 విద్యాసంవత్సరానికి ఇదే చివరిరౌండ్ అని తెలిపింది. అఖిల భారత కోటా, రాష్ట్ర కోటాలో సీటు లభించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రౌండ్-3లో సీటు వచ్చినా వాటిని నిరాకరించిన అభ్యర్థులకు అవకాశం లేదు. ఈ ప్రత్యేక కౌన్సిలింగ్‌లో సీటు వచ్చినా చేరని అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేస్తారు. వారిని వచ్చే ఏడాది నీట్ పరీక్ష రాయకుండా నిరోధిస్తారు. రాష్ట్రాల భాగస్వామ్యం తోనే ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ జరుగుతుంది.