- పాదరక్షను నోటిలో పెట్టుకొని క్షమాపణలు చెప్పాలని బలవంతం
- వ్యాపారస్తురాలిపై కేసు నమోదు
గాంధీనగర్ : గుజరాత్‌లో దళితుడికి అవమానకర ఘటన ఎదురైంది. ఆయనపై ఒక వ్యాపారస్తురాలు, ఆమె ఉద్యోగులు అమానవీయంగా ప్రవర్తించారు. బాధితుడిపై దాడికి దిగి ఆయన నోటిలో ఆమె పాదరక్షను పెట్టి, క్షమాపణలు చెప్పించేందుకు బలవంతం చేశారు. దీంతో పోలీసులు సదరు వ్యాపారస్తురాలిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మోర్బీ పట్టణంలో చోటు చేసుకున్నది. నిందితురాలిని విభుతి పటేల్ అలియాస్ రనీబాగా గుర్తించారు. ఆమె రనీబా ఇండిస్టీస్ ప్రయివేట్ లిమిటెడ్‌ను నడుపుతున్నది. పోలీసులు, బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలేశ్ దల్సానియా (21).. విభుతి పటేల్‌కు చెందిన ఎక్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో అక్టోబర్ నెలలో 16 రోజులు పని చేశాడు. అక్టోబర్ 2న కంపెనీలో చేరిన దల్సానియాకు నెలకు రూ.12 వేల జీతం కుదిరింది. అయితే, 18న మాత్రం ఆయనను ఇక పనికి రావద్దని కంపెనీ తెలిపింది. అకస్మాత్తుగా ఇలా చెప్పటంతో దల్సానియా షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తన పెద్దన్న మెహుల్, వారి పొరుగున ఉండే వ్యక్తి భవేశ్ మక్వానాతో కలిసి రవాపార్ రోడ్ మీద ఉండే రనీబా ఇండిస్టీస్ కార్యాలయానికి వెళ్లారు. తాను పని చేసిన రోజులకు రావాల్సిన జీతాన్ని దల్సానియా డిమాండ్ చేశాడు. అయితే, విభుతి పటేల్ సోదరుడు ఓమ్ పటేల్.. దల్సానియాపై దాడికి దిగాడు. విభుతి పటేల్‌తో పాటు మరో ఐదుగురు ఉద్యోగులు కూడా బాధతుడిని కొట్టారు. ఆఫీసు బిల్డింగ్ మీదకు తీసుకెళ్లి బెల్టుతో దల్సానియాను కొట్టారు. ఇష్టం వచ్చినట్టు తన్నారు. పిడిగుద్దులు గుద్దారు. విభుతి పటేల్ పాదరక్షను నోటిలో పెట్టునొని క్షమాపణ చెప్పాలని వారు దల్సానియాను బలవంతం చేశారు. రవాపూర్ రోడ్డు మీద కనబడినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా దల్సానియాను చంపేస్తానని నిందితురాలు హెచ్చరించింది. అయితే, ఈ ఘటనపై ఫిర్యాదు అందటంతో పోలీసులు నిందితురాలిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనను దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.