డెహ్రడూన్ : ఉత్తర్‌కాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను బయటకు తీసుకుని రావడంలో ర్యాట్ హోల్ మైనర్లే హీరోలుగా నిలిచారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలు అనేక మార్గాల్లో తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. భారత మిషన్లతోపాటు అమెరికా నుంచీ తీసుకొచ్చిన అత్యాధునిక మెషిన్లు కూడా డ్రిల్లింగ్‌లో ధ్వంసమయ్యాయి. ఇలాంటి సమయం లో ర్యాట్ హోల్ మైనర్లు అత్యంత ప్రమాదకరమైన విధానంలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చి కార్మికులకు కొత్త జీవితం అందించారు. ఢిల్లీ, ఝాన్సీ నుంచి వచ్చిన ఈ మైనర్లు కేవలం 24 గంటల్లోనే వాయువేగంతో డ్రిల్లింగ్ పూర్తిచేశారు. ఈ ఆపరేషన్ తరువాత ర్యాట్ హోల్ మైనర్లు మీడియాతో మాట్లాడారు. ‘మేం 15 మీటర్లు తొలిచి సొరంగంలోకి చేరుకున్నాం. అక్కడ కార్మికులను చూడగానే చాలా సంతోషంగా అనిపించింది’ అని తెలిపారు. కార్మికులు మమల్ని హత్తుకున్నారని, బాదం పప్పులు ఇచ్చారని ర్యాట్ హోల్ మైనర్లు తెలిపారు.
అసలు ర్యాట్ హోల్ మైనింగ్ అంటే..
సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్ హోల్ మైనింగ్‌గా వ్యవహరిస్తారు. ఇలా నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్‌గా పేర్కొంటారు. ఇది సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంటుంది. కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలడు. ఈ క్రమంలో నిర్దేశిత బొగ్గు పొరను చేరుకున్న తర్వాత.. బొగ్గును వెలికి తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పార, తదితర ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే తవ్వకం చేపడతారు. తాళ్లు, అవసరమైతే నిచ్చెనల సాయంతో వెళ్లి కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ.. ఆ శిథిలాలను కొంత దూరంలో డంప్ చేస్తారు. అక్కడినుంచి ట్రాలీ ద్వారా బయటకు తరలిస్తారు. అత్యంత పలుచటి భూపొరలుండే మేఘాలయ వంటి ప్రాంతాల్లో చేసే మైనింగ్‌లో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుం టారు. ఇతర సాంకేతికతలతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండటంతో పలు ప్రాంతాల్లో దీన్నే ఎక్కువగా ఎంచుకుంటారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో మాత్రం 80 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల పైపు ద్వారా నిపుణులు లోపలికి వెళ్లి తవ్వకాలు చేపట్టారు. పైపులైన్‌లో లైట్లు, ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేశారు. ర్యాట్ హోల్ మైనింగ్‌పై అనేక విమర్శలు, వివాదాలూ ఉన్నాయి. ఈ విధానంలో గనుల్లోకి వెళ్లే కార్మికులకు భద్రత లేకపోవడం ప్రధాన సమస్య. వర్షాలు వచ్చినప్పుడు అవి నీటితో నిండిపోవడం వంటివి ప్రతికూల అంశాలు. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. 2014 లో దీన్ని నిషేధించింది. నిషేధించిన టెక్నిక్‌ను ఎలా వాడారని అధికారులను ప్రశ్నించగా, అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటివి వాడుకోవడం తప్పేమీ కాదని సమాధానమిచ్చారు.
సొరంగం తవ్వకాలు సాగిన తీరిలా !
నవంబరు 12న కొండచరియ విరిగిపడడంతో ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి రహదారిపై సిల్క్‌యారా వద్ద నిర్మిస్తున్న సొరంగంలో 41మంది కార్మికులు చిక్కుకుపోయారు.
- సమాచారం తెలిసిన వెంటనే లోపల వున్నవారిని వెలికి తీసే కార్యక్రమం ఆరంభించారు. డెహ్రాడూన్ నుండి వచ్చిన ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం సాయంతో రంగంలోకి దిగాయి.
- సొరంగంలోని శిధిలాలను తొలగించేందుకు ముందుగా జెసిబిని దింపారు. కానీ పైనుండి శిధిలాలు పడుతుండడంతో ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. దాంతో డెహ్రడూన్ నుండి ఆగర్ యంత్రాన్ని రప్పించి డ్రిల్లింగ్ మొదలుపెట్టారు.
- అయితే ఇది కూడా విఫలమైంది. సొరంగంలో 50మీటర్లు డ్రిల్లింగ్ తర్వాల ఇనుప పట్టీ అడ్డు రావడంతో యంత్రం పనిచేయలేదు. హైదరాబాద్ నుండి ప్లాస్మా కట్టర్‌ను తీసుకువచ్చారు. ఆగర్ యంత్రాన్ని కట్ చేసి 57 మీటర్ల వరకు తవ్వారు.
- 16వ రోజున ఇంకో రెండు మీటర్ల దూరంలో లక్ష్యం వుందనగా, ర్యాట్ హోల్ మైనర్లతో మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టారు. మంగళవారం రాత్రి 9గంటల కల్లా మొత్తంగా 41మందినీ బయటకు తీసుకువచ్చారు.
- ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, బిఆర్‌ఓ, ఆర్‌విఎన్‌ఎల్, ఎస్‌జెవిఎన్‌ఎల్, ఓఎన్‌జిసి, ఐటిబిపి, ఎన్‌హెచ్‌ఎఐడిసిఎల్, టిహెచ్‌డిసి, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, భారత ఆర్మీ, వైమానిక దళంతో సహా పలు సంస్థలు, అధికారులు, ఉద్యోగులు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు.