బిజెపి ఎంపి బిధూరికి లోక్‌సభ హక్కుల కమిటీ ఆదేశం
న్యూఢిల్లీ : సహచర బిఎస్‌పి ఎంపి దినిష్ అలీపై మతపరమైన దూషణలకు పాల్పడిన బిజెపి ఎంపి రమేష్ బిధూరికి లోక్‌సభ హక్కుల కమిటీ సమన్లు పంపింది. డిసెంబరు 7వ తేదీన తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. చంద్రయాన్-3 ప్రయోగంపై సెప్టెంబర్ 21న చర్చ సందర్భంగా బిధూరి మతపరమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అలీని దూషించారు. ‘ఈ ముల్లాను బయటికి గెంటండి. ఇతను ఓ ఉగ్రవాది’ అంటూ నిందించారు. బిధూరిని వారించాల్సిన బిజెపి ఎంపీలు, మాజీ మంత్రులు రవి శంకర్ ప్రసాద్, హర్షవర్థన్ నవ్వుతూ చూస్తుండిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఉదంతం జరిగిన తర్వాత కూడా బిధూరిని బిజెపి రాజస్థాన్‌లోని టాంక్ జిల్లాకు పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. అక్టోబర్ 11న తన ఎదుట హాజరు కావాలని హక్కుల కమిటీ గతంలోనే బిధురికి తాఖీదు పంపింది. అయితే రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున తాను రాలేనంటూ ఆయన తప్పించుకున్నారు. దీంతో వచ్చే నెల 7న హాజరు కావాలని హక్కుల కమిటీ తాజాగా ఆదేశించింది. బిధూరిపై విచారణ జరపాలని కోరుతూ సెప్టెంబర్ 24న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అలీ ఓ లేఖ రాశారు. ‘బిధూరి తన ప్రసంగంలో నాపై అత్యంత తప్పుడు, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అవి లోక్‌సభ రికార్డుల్లో ఉన్నాయి’ అని ఆ లేఖలో తెలియజేశారు.