యువ న్యాయ నిపుణులకూ అవకాశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అఖిల భారత న్యాయ సర్వీసులు (ఎఐజెఎస్) రూపకల్పన చేస్తే న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి అది ఒక మార్గంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. యువ న్యాయనిపుణుల్లో ప్రతిభ, పోటీతత్వం, పారదర్శకతను పెంపొందించడానికి కూడా దోహదం చేస్తుందని ఆమె తెలిపారు. ఎఐజెఎస్‌ను ఏర్పాటు చేయాలని సూచిస్తూ దాని ప్రాధాన్యతను ఆమె వివరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత అద్వితీయమైనది పేర్కొన్నారు. బెంచ్ అండ్ బార్‌లో అన్ని సామాజిక తరగతుల వారికి అవకాశం కల్పిస్తే సరైన న్యాయం అందించడం సాధ్యమవు తుందన్నారు. ఎఐజెఎస్ ఏర్పాటుతో మరింత మెరుగైన న్యాయాన్ని అందించేందుకు తోడ్పడుతుందన్నారు. పత్రిభావంతమైన యువతను దీనికి ఎంపిక చేసి న్యాయమూర్తులుగా తీర్చి దిద్దవచ్చునని తెలిపారు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు యువ న్యాయవేత్తల ప్రతిభను పెంపొందించగలదని ఆమె పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ప్రజల కోర్టు : జస్టిస్ చంద్రచూడ్
గత ఏడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టు ‘ప్రజల కోర్టు’గా వ్యవహరిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ప్రజలు కోర్టుకు వెళ్లడానికి ఏమాత్రం భయపడొద్దని సూచించారు. వ్యవస్థాపిత ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రక్రియల ద్వారా రాజకీయ వైరుధ్యాలను పరిష్కరించుకునేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందన్నారు. అదే తరహాలో అనేక భేదాభిప్రాయాలను పరిష్కరించేందుకు న్యాయ వ్యవస్థ సహాయపడుతుందని తెలిపారు. గత 70 ఏళ్లలో వేల మంది పౌరులు సుప్రీం కోర్టు తలుపుతట్టారని గుర్తుచేశారు. న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే వారు సర్వోన్నత న్యాయ వ్యవస్థను ఆశ్రయించారని తెలిపారు. అక్రమ అరెస్టుల్లో జవాబుదారీతనం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ, నిర్బంధ కార్మికుల హక్కులు, సామాజిక రుగ్మతల నిర్మూలన, గిరిజన భూముల హక్కులు.. ఇలా వివిధ అంశాల కోసం సామాన్య పౌరులు కోర్టును ఆశ్రయించారని చంద్రచూడ్ వివరించారు. ఈ ఉదంతాలన్నీ కేవలం కోర్టు గణాంకాల్లో సమాచారం మాత్రమే కాదన్నారు. సుప్రీంకోర్టుపై ప్రజలకు ఉన్న అంచనాలను ఇవి ప్రతిబింబిస్తాయని వివరించారు. తీర్పుల ద్వారా న్యాయాన్ని అందించడమే కాకుండా.. పౌర కేంద్రీకృత విధానాల రూపకల్పనకూ సుప్రీంకోర్టు నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజరు కిషన్ కౌల్, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిష్ సి అగర్వాలా పాల్గొన్నారు.