కేంద్రం కనుసన్నల్లో…  ఒటిటిలు

  హిందూత్వ అజెండాతోనే కంటెంట్‌ ఉండాలని బిజెపి సర్కార్‌ పెత్తనం
 సామాజిక మాధ్యమాల పైనా నియంత్రణ
న్యూఢిల్లీ : చలనచిత్రాలు, వెబ్‌ సిరీస్‌లను ఒటిటిలో ప్రసారం చేసే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ వంటి సంస్థలపై కేంద్ర ప్రభుత్వం, బిజెపి దొడ్డిదారిన పెత్తనం చెలాయిస్తున్నాయి. ఈ సంస్థలు ప్రసారం చేసే భారతీయ కార్యక్రమాలు తమ ఇష్టానుసారమే రూపొందాలని, లేకుంటే క్రిమినల్‌ చర్యలు తప్పవని బెదిరిస్తున్నాయి. అంతేకాక ప్రజల నుండి కూడా ఒత్తిడి వచ్చేలా పథకాలు రచిస్తున్నాయి. ఇక బిజెపి, దాని అనుబంధ సంస్థలు తమ హిందూత్వ అజెండాను వ్యాప్తి చేసేందుకు సామాజిక మాధ్యమం వాట్సప్‌ను ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపు ట్విట్టర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాలను, వినిపించే అసమ్మతి గళాన్ని అణచివేసేందుకు అధికార యంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నాయి. తెర వెనుక జరుగుతున్న ఈ తతంగంపై ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక జరిపిన పరిశోధనలో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి.

ప్రసారాలపై ఉక్కుపాదం
ఒటిటిలో సినిమాలు, సిరీస్‌లను ప్రదర్శించే సంస్థలపై కేంద్రం స్వీయ నిర్బంధాన్ని విధిస్తోందని వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. మన దేశంలోని నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, వారి న్యాయవాదులపై కమలనాథుల పెత్తనం పెరిగిపోతోంది. బిజెపి లేదా హిందూ సంస్థలకు భిన్నమైన ప్రస్తావనలు చేయరాదని ఆదేశాలు జారీ అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దేశంలో తమకు ప్రతికూలమైన రాజకీయ, మతపరమైన, కులపరమైన అంశాలను ప్రసారం చేయకుండా నిషేధం విధిస్తున్నారు. ఒకవేళ అలాంటివి ప్రసారమవుతున్నా మధ్యలోనే నిలిపివేస్తున్నారు. చిత్రీకరణ పూర్తయి ప్రసారానికి సిద్ధంగా ఉన్న సిరీస్‌లను, చిత్రాలను కూడా నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో అనుమతించడం లేదు. ఈ తతంగం అంతా కేంద్రం, బిజెపి పెద్దల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది ‘కనిపించని సెన్సార్‌షిప్‌’ అని సినీ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వ్యాఖ్యానించారు.
సిరీస్‌ల ప్రదర్శన విషయంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ నిబంధనలు జారీ చేస్తోంది. ఇక పోలీసుల నుండి హెచ్చరికలు సరేసరి. రాజకీయ నేపథ్యంతో ప్రైమ్‌ వీడియో నిర్మించిన ‘టాండవ్‌’ సిరీస్‌పై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని వెంటనే వెళ్లిపోవాలని, పాస్‌పోర్టును అప్పగించాలని పోలీసులు బెదిరించారు. టాండవ్‌కు పట్టిన గతే తమకూ పట్టకుండా నిర్మాణ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలో ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన పార్థ్‌ అరోరా సూచించారు. కంపెనీలు తమ ప్రాజెక్టులను సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ కర్ర పెత్తనం కారణంగా అనేక ఇతర ప్రాజెక్టులు సైతం అర్థాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వ పనితీరుపై వ్యాఖ్యలు చేస్తూ, దేశ రాజకీయాలను సునిశితంగా విమర్శించిన ‘గార్మింట్‌’ అనే సిరీస్‌ చిత్రీకరణ పూర్త్తయినా ప్రదర్శనకు నోచుకోలేదు. ముంబయి నగరంపై రాసిన ‘మాగ్సిమమ్‌ సిటీ’ అనే నాన్‌-ఫిక్షన్‌ పుస్తక ప్రచురణను కూడా నిలిపేశారు.

2021 నుండే ఆంక్షలు మొదలు
ఒటిటి వేదికలపై నియంత్రణ కోసం మోడీ ప్రభుత్వం, బిజెపి2021 ప్రారంభంలోనే ప్రయత్నాలు ప్రారంభించాయి. సినిమాలు, సిరీస్‌లు ప్రసారం చేసే కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించేలా కొన్ని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వీటి ప్రకారం వీక్షకుల ఫిర్యాదులను ఆయా కంపెనీలు పక్షం రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. లేకుంటే పరిశ్రమకు సంబంధించిన కమిటీ కానీ లేదా వివిధ మంత్రిత్వ శాఖల సిబ్బందితో కూడిన ప్రభుత్వ కమిటీ కానీ వాటిని వీక్షిస్తాయి. ఒటిటి వేదికలపై ప్రభుత్వం ఈ విధంగా పెత్తనం చెలాయించడానికి ఆయా కంపెనీలు ఆర్జిస్తున్న ఆదాయం కూడా ఓ కారణం. దేశంలో సిరీస్‌లు, చిత్రాలు ప్రదర్శిస్తున్న సంస్థల ఆదాయం గత సంవత్సరం 2.6 బిలియన్‌ డాలర్లు ఉండగా 2030 నాటికి అది 13 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. అందుకే అవి ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోక తప్పడం లేదు.

2019లో తొలి ఫిర్యాదు
ఒటిటి సంస్థలు ప్రసారం చేస్తున్న సిరీస్‌లపై 2019లో హిందూత్వ వాది రమేష్‌ సోలంకి తొలిసారిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒటిటిలపై ఎలా ఒత్తిడి చేయాలన్న విషయంపై చర్చించేందుకు తన వంటి హిందూ జాతీయతావాదులతో కూడిన వందలాది వాట్సప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపులు సమావేశమయ్యాయని వాషింగ్టన్‌ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఈ గ్రూపు సభ్యులు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారని చెప్పారు. సోలంకీ గత సంవత్సరం బిజెపితీర్థం పుచ్చుకున్నారు. తప్పు చేసినా, గీత దాటినా శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ అర్థం చేసుకున్నాయని, గుణపాఠం నేర్చుకున్నాయని వివరించారు. ‘నీ తలపై తుపాకీ గురి పెట్టి ఉంది. అది ఎప్పుడైనా పేలుతుంది’ అని ఓ దర్శకుడు తాజా పరిస్థితిపై వ్యాఖ్యానించారు. దేశంలోని మీడియాను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం ఈ ఏడాది వివాదాస్పద ‘ప్రసార సర్వీసుల నియంత్రణ’ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

➡️