ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, అన్ని రాజకీయ పార్టీలకు దీనితో ప్రయోజనమేనని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, జమిలి ఎన్నికలపై అన్ని గుర్తింపు పొందిన పార్టీలతోనూ తాను మాట్లాడామని, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సమయంలో జమిలి ఎన్నికలను మద్దతు తెలిపాయని అన్నారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, ఇందుకు అన్ని పార్టీలు నిర్మాణాత్మకంగా మద్దతు తెలపాలని మాజీ రాష్ట్రపతి కోరారు. జమిలి ఎన్నికలతో డబ్బు ఆదా అవుతుందని, దానిని అభివృద్ధి పనులకు ఉపయోగించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయాన్ని అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా సిఫారసులు అందజేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం 8 మంది సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.