భువనేశ్వర్ : ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహితుడు, మాజీ ఐఎఎస్ అధికారి వి.కార్తికేయన్ పాండియన్ బిజు జనతా దళ్ (బిజెడి)లో చేరారు. నవీన్ పట్నాయక్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు సీనియర్ బిజెడి నేతల సమక్షంలో సోమవారం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2000 బ్యాఛ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి కార్తికేయన్ సర్వీస్ రూల్‌ను ఉల్లంఘించడంతో పాటు పలు వివాదాలకు కారణమయ్యారు. కార్తికేయన్ ఈ ఏడాది అక్టోబర్ 23న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు నవీన్ పట్నాయక్ కేబినెట్ మంత్రి హోదాను కట్టబెట్టారు. 5టి (ట్రాన్స్‌ఫర్మేషనల్ ఇనిషియేటివ్) మరియు నవీన్ కొత్త పథకానికి చైర్మన్‌గా నియమించబడ్డారు. కార్తికేయన్ 2002లో కలహండి జిల్లాలోని ధర్మగర్ సబ్ కలెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2005లో మయూర్ భంజ్ జిల్లా కలెక్టర్‌గా, 2007లో గంజాం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. గంజాంలో కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో కార్తికేయన్ నవీన్ పట్నాయక్‌కు సన్నిహితంగా మెలిగారు. 2011లో సిఎం ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. ముఖ్యమంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా వ్యవహరిస్తూనే .. 2019లో 5టి చైర్మన్‌గా అదనపు బాధ్యతను కూడా ఇచ్చారు.