ఎన్‌సిఇఆర్‌టి ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ : విద్య కాషాయీకరణలో భాగంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చరిత్రలో పురాణేతిహాసాలను చొప్పించేందుకు సిద్ధమైంది. రామాయణ, మహాభారతాలను చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎన్‌సిఇఆర్‌టి ఉన్నత స్థాయి కమిటీ ద్వారా సిఫార్సు చేయించింది. చరిత్రలో ఇప్పటివరకు మూడు యుగాలు (ప్రాచీన, మధ్య, ఆధునిక) ఉండగా ఇప్పుడు క్లాసికల్ యుగాన్ని కొత్తగా చేర్చింది. ఆ పేరుతో వేదాలు, రామాయణ, మహాభారతాలను చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చొప్పించే ప్రయత్నం చేస్తోంది.
ప్రొఫెసర్ సిఐ ఇజాక్ నేతృత్వంలోని ఎన్‌సిఇఆర్‌టి సోషల్ సైన్స్ కమిటీ ఈ మార్పులు చేర్పులకు సంబంధించి పలు సిఫారసులు చేసింది.
వేదాలు, ఆయుర్వేదానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను కూడా సిలబస్‌లో భాగంగా ప్రవేశపెట్టాలని కమిటీ సూచించింది. సోషల్ సైన్సెస్‌పై తుది వైఖరి పత్రంలో పేర్కొన్న ఈ సూచనలను రేపు కొత్త ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో చేర్చుతారు.
తాము సిఫార్సు చేసిన మార్పుల గురించి ఇజాక్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు భారత చరిత్రను మూడు భాగాలుగా విభజించి బోధిస్తున్నారు. ఇప్పుడు క్లాసికల్ విభాగం కింద, రామాయణం, మహాభారతం వంటి ఉద్గ్రంథాలను విద్యార్థులు నేర్చుకోవాలని తాము సిఫార్సు చేశామని అన్నారు. రాముడు అంటే ఎవరు, ఆయన ఏం చేశారు అనే వివరాలు విద్యార్ధికి తెలుస్తాయని అన్నారు.
అన్ని తరగతి గదుల్లో గోడలపై స్థానిక భాషల్లో రాజ్యాంగం ముందు పీఠిక రాయించాలని కమిటీ సిఫార్సు చేసిందన్నారు. సుభాష్ చంద్రబోస్ వంటి జాతీయ యోధులకూ తగిన స్థానం కల్పించాలని సూచించామన్నారు. భారత యోధులు, వారి పోరాటాలు, విజయాలు వంటి సమాచారం విద్యార్ధులకు తెలియాలని, తద్వారా వారు విశ్వాసాన్ని సముపార్జించుకుంటారని ఇజాక్ తెలిపారు.