చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ముగిసిన ప్రచారం

  • రేపే పోలింగ్‌

భోపాల్‌, రారుపూర్‌ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు రెండో దశకు చేరుకుంది. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. ఈ రెండో రాష్ట్రాల్లో బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. చివరి రోజున అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న ఒకేరోజులో పోలింగ్‌ జరగనుంది. శుక్రవారం పోలింగ్‌ జరిగే రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి, కాంగ్రెస్‌ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది.మధ్యప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో 5.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. 2.88 కోట్ల మంది పురుషులు కాగా, 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 22.36 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

  • ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు..

ఛత్తీస్‌గఢ్‌లో 70 అసెంబ్లీ స్థానాల్లో శుక్రవారం ఓటింగ్‌ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశలో 20 స్థానాలకు పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండో దశలో మొత్తంగా 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశలో మొత్తం 1.63కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. ఇందుకోసం 18,883 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. 68 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికల్లో పదిహేనేళ్లు అధికారంలో ఉన్న బిజెపి 15 స్థానాలకే పరిమితమైంది.

➡️