కోల్‌కతా : వచ్చే ఏడాది మార్చి 30 నాటికి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తుది ముసాయిదా సిద్ధంకావచ్చని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అజయ్ మిశ్రా ఆదివారం పశ్చిమబెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలు జిల్లాలో నిర్వహించిన మతువా కమ్యూనిటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లోని మతపరమైన హింస నుండి పారిపోయిన మతువా పౌరసత్వ హక్కులను ఎవరూ లాక్కోలేరని అన్నారు. సిఎఎని అమలు చేసే ప్రక్రియ గత రెండేళ్లలో వేగవంతమైందని, కొన్ని సమస్యలు పరిష్కరించబడుతున్నాయని అన్నారు. మతువాల నుండి పౌరసత్వ హక్కులను ఎవరూ లాక్కోలేరని, వచ్చే ఏడాది మార్చి నాటికి సిఎఎ తుది ముసాయిదా అమల్లోకి రావడానికి సిద్ధమవుతుందని భావిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు.