బిల్లుకు జార్ఖండ్ గవర్నర్ ఆమోదం
రాంచీ : జార్ఖండ్ పోటీ పరీక్షలు (రిక్రూట్‌మెంట్‌లో అక్రమాల నియంత్రణ, నివారణ) బిల్లు 2023కు ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గురువారం ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో ప్రకారం పోటీ పరీక్షల్లో మోసాలకు పాల్పడితే జీవిత ఖైదు, రూ. 10 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. ఆగస్టు3న రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లులోని నిబంధన ప్రకారం, పరీక్షల్లో ఒక అభ్యర్థి మొదటిసారి పట్టుబడితే రూ. 5 లక్షల జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో తొమ్మిది నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి పట్టుబడితే రూ.10 లక్షల జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో 30 నెలల జైలు శిక్ష విధిస్తారు. నేరం రుజువైతే అభ్యర్థిని 10 సంవత్సరాల పాటు ఏ పోటీ పరీక్ష రాయడానికి అనుమతించరు. ఈ బిల్లు ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ గానీ లేదా పోటీ పరీక్ష నిర్వహించే మేనేజ్‌మెంట్ సిస్టమ్, పేపర్లు రవాణా చేసే వ్యక్తి లేదా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు అక్రమాలకు పాల్పడితే, అప్పుడు 10 సంవత్సరాల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధిస్తారు. రూ. 2 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. ఒక వేళ జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. అలాగే, పోటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం, జవాబు పత్రాలపై అభ్యర్థులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిథులు లేవనెత్తే ఫిర్యాదులు, ప్రశ్నలు ఆధారంగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా ఈ బిల్లు నిషేధం విధిస్తుంది. పైగా ఫిర్యాదులు చేసే వ్యక్తిని ఎలాంటి అనుమతులు లేకుండానే అరెస్టు చేసే వీలు కల్పిస్తుంది. ఈ బిల్లును ఒక నల్ల చట్టంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.