న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు భారత్ మానవతా సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో మొదటి విడతలో భాగంగా 6.5 టన్నుల సామగ్రిని పంపిన భారత్, తాజాగా రెండో విడత సాయాన్ని పంపింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ‘మేము పాలస్తీనా ప్రజలకు మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటామని ‘ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భారత వైమానిక దళానికి చెందిన రెండవ సీ17 విమానం 32 టన్నుల సాయంతో ఈజిప్ట్‌కి బయలుదేరిందని ఆదివారం ఉదయం పోస్ట్ చేశారు. ఈ సామగ్రిని మొదట ఈజిప్టులోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి చేరుస్తారు. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారు. ప్రస్తుతం గాజాలోకి మానవతా సాయం కోసం రఫా మాత్రమే క్రాయింగ్ పాయింట్‌గా ఉంది.