కెనడా : ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో నిజ్జర్ హత్య విషయంలో.. దర్యాప్తు పూర్తికాకముందే భారత్‌ని దోషిగా తేల్చవద్దంటూ కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ మండిపడ్డారు. తాజాగా ఆయన సిటివి ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రూడో వ్యాఖ్యలకు స్పందించారు. ‘ఇక్కడ రెండు విషయాలను గుర్తించాలి. ఒకటి, విచారణ పూర్తికాకుండానే భారత్‌ని దోషిగా నిర్ధారించడం? రెండోది.. ఇదేనా చట్టబద్ధమైన పాలనా అంటే?’ అని అన్నారు. క్రిమినల్ టర్మినాలజీ ప్రకారం.. విచారణకు సహకరించమని అడిగితే.. వారు అప్పటికే దోషి అని అర్థం’ అని సంజరు వ్యాఖ్యానించారు. కచ్చితంగా నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సరైన ఆధారాలు ఇవ్వాలని తాము పలుమార్లు కెనడాని అడిగామని, వాటిని పరిశీలించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్బంగా సంజయ్ చెప్పారు.