తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఆరెంజ్‌ అలెర్ట్‌

Nov 20,2023 15:32 #kerala, #rains, #Tamil Nadu

 

చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లో వారంరోజులపాటు నిర్విరామంగా వర్షాలు కురవనున్నాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేకించి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు ఐఎండి ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.
కాగా, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. అలాగే కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేళి, తూత్తుకుడి జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవున్నాయని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే తమిళనాడులో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ముందస్తుగా అధికారులు 400 మందితో రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేశారు. ఇక కేరళ రాష్ట్రంలో అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్‌ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది.

➡️