ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు చట్టపరమైన రక్షణ కల్పించాలి

ప్రభుత్వాన్ని కోరిన పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ :   చికిత్స పొందుతూ రోగులు చనిపోయినప్పుడు వారి బంధువులు, అటెండెంట్ల నుండి దాడులను, హింసను ఎదుర్కొంటున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు సముచితమైన రీతిలో చట్టపరమైన ఆరోగ్య రక్షణలను ప్రవేశపెట్టే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని బిజెపి సభ్యుడు బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది. ప్రతిపాదిత మూడు క్రిమినల్‌ చట్టాలను పరిశీలించిన, వివిధ వైద్య సమాఖ్యలు, సంఘాలు అందజేసిన మెమొరాండాలపై చర్చించిన ఈ స్థాయీ సంఘం ఆరోగ్య కార్యకర్తలకు చట్టపరమైన రక్షణలు కల్పించాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు కమిటీ తన నివేదికను అందజేసింది. ఆరోగ్య సేవలందించే సిబ్బందిపై హింసకు దిగడం వంటి చర్యలకు శిక్ష విధించేలా భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌)లోని 115వ క్లాజు కింద నిబంధనలను ప్రవేశపెట్టాలని వివిధ వైద్య సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై ఇలాంటి హింసాత్మక దాడులు దేశమంతా జరుగుతునే వున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల ప్రయోజనార్ధం కొన్ని చట్టపరమైన రక్షణలు ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని వైద్య సమాఖ్యలు కమిటీని కోరాయి. సాధారణ శిక్షార్హమైన నిబంధనలు అందరికీ వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తే ఇతర వర్గాల నుండి ఇదే రకమైన డిమాండ్లు రావచ్చని హోం శాఖ పేర్కొంది. హింసాత్మక దాడులను ఎదుర్కొనే ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కోసం మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ యాక్ట్‌ను ప్రవేశపెట్టాలని ఆరోగ్య శాఖ ఒక ప్రతిపాదన పెట్టిందని, ప్రభుత్వం తగు చట్టపరమైన రక్షణలు కల్పించగలదని ఆశిస్తున్నామని కమిటీ అభిప్రాయపడింది.

➡️