డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం ..! 

 న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీనియర్‌ నేతలు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌; వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌లు హాజరుకానున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

డిసెంబర్‌ 4 నుండి 22 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో వలసకాలం నాటి క్రిమినల్‌ చట్టాల స్థానంలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటులో 37 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 12 పరిశీలన మరియు ఆమోదం కోసం జాబితా చేయగా, ఏడు బిల్లులు ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదం కోసం జాబితా చేసినట్లు సమాచారం. 2023-24 సంవత్సరానికి గాను గ్రాంట్ల కోసం సప్లిమెంటరీ డిమాండుల మొదటి బ్యాచ్‌ను కూడా ప్రభుత్వం సమర్పించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రశ్నల కోసం నగదు ఆరోపణల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి మహువా మొయిత్రాపై ఎథిక్స్‌ కమిటీ నివేదికను కూడా ఈ సమావేశంలో లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

➡️