డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో టన్నెల్ కూలిన ఘటనలో కార్మికులను రక్షించే చర్యలు అప్పుడే తుది దశకు చేరుకునేలా కనిపించటం లేదు. ఈ ఆపరేషన్‌కు ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తున్నది. ఈ విషయాన్ని జాతీయ విపత్తుల నియంత్రణ సమస్థ (ఎన్‌డిఎంఎ) తెలిపింది. టన్నెల్ కూలి గత 13 రోజులుగా 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయిన విషయం విదితమే. అయితే, అప్పటి గత 13 రోజులుగా అధికారులు రక్షణ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ అనేక ఇబ్బందులు ఎదురవటంతో కార్మికులను కాపాడటంలో జాప్యం జరుగుతున్నది. కార్మికులు చిక్కుకున్న సొరంగం వద్ద సహాయక చర్యలు నిలిచిపోయాయి. టన్నెల్ వద్ద నేటి(ఆదివారం) నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. డ్రిల్లింగ్ చేపట్టిన ఆగర్ మెషిన్‌కు శుక్రవారం రాత్రి శిథిలాల్లోని ఇనుపపట్టి అడ్డుపడింది. దీంతో ఆగర్ మెషిన్ బ్లేడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. అయితే, ప్రస్తుతం అది పనికి రాకుండా పోవటంతో మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. కాగా, రోజులు గడుస్తున్నా కొద్దీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాల్లో ఆందోళన కలుగుతున్నది.