జలంధర్ : ఘాద్రి ఉద్యమ వారసత్వాన్ని సిపిఎం దేశ నలుమూలలకు తీసుకు వెళుతుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు తెలిపారు. లాహోర్‌లోని సెంట్రల్ జైలులో 1915 నవంబర్ 16న ఏడుగురు ఘాద్రి వీరులకు ఉరిశిక్ష విధించారు. వారి ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ సిపిఎం పంజాబ్ రాష్ట్ర కమిటీ గురువారం భారీ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో నీలోత్పల్ బసు మాట్లాడుతూ, ఘాద్రి విప్లవకారుల, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల వారసత్వాన్ని దేశంలోని ప్రతి పల్లెకు, పట్టణానికి తీసుకెళ్లాలని సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. కాలాపానీ అని పిలిచే అండమాన్- నికోబార్‌లోని జైలుకు వెళితే అక్కడ విప్లవకారుల జాబితా ఉందని, జాబితాలో ఎక్కువ మంది పంజాబీలు, బెంగాలీలు ఉన్నారని చెప్పారు.స్వాతంత్య్ర పోరాటంలో గదర్ ఉద్యమం ఆదర్శప్రాయమైన పాత్రను పోషించింది. వీరంతా గొప్ప గొప్ప త్యాగాలు చేశారు’ అని నీలోత్పల్ బసు గుర్తు చేశారు. ఫాసిస్ట్ ఇజ్రాయిల్ సాగిస్తున్న హంతక దాడులకు వ్యతిరేకంగా, పాలస్తీనియన్లకు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
సిపిఎం పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి సుఖ్వీందర్ సింగ్ సెఖోన్ మాట్లాడుతూ ఘాద్రి విప్లవకారుల వారసత్వాన్ని పంజాబ్‌లోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం గదర్ వీరుల స్ఫూర్తితో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
లాహోర్‌లోని సెంట్రల్ జైలులో 1915 నవంబర్ 16న లాహోర్ కుట్ర కేసు ఆరోపణలతో కర్తార్ సింగ్ సరభా, విష్ణు గణేష్ పింగెల్, సురైన్ సింగ్ సీనియర్, సురైన్ సింగ్ జూనియర్, బక్షిష్ సింగ్, జగత్ సింగ్, హర్నామ్ సింగ్ సియాల్కోటిలను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది. ఈ కేసులో 291 మందిపై అభియోగాలు మోపింది. వీరిలో 42 మందికి మరణశిక్ష విధించారు. 114 మందికి జీవిత ఖైదు, 93 మందికి వివిధ రకాల జైలు శిక్షలు అమలు చేశారు.