నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్‌

 

  • శంకరయ్య మృతికి పొలిట్‌బ్యూరో సంతాపం

న్యూఢిల్లీ : కమ్యూనిస్టు యోధుడు , పాత తరం కమ్యూనిస్టు నేతల్లో ఒకరైన కామ్రేడ్‌ ఎన్‌.శంకరయ్య (102) మృతి పట్ల పార్టీ పొలిట్‌బ్యూరో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. మదురైలోని అమెరికన్‌ కాలేజీ విద్యార్ధిగా ఉండగానే శంకరయ్య స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అయితే పరీక్షల ముందు ఆయన అరెస్టు కావడంతో డిగ్రీ పొందలేకపోయారు. 1940లో ఆయన కమ్యూనిస్టు పార్లీఓ చేరి, తమిళనాడు ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారని పొలిట్‌బ్యూరో కొనియాడింది. స్వాతంత్య్రం వచ్చేవరకు ఆయన మొత్తంగా 8ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. పార్టీ జాతీయ కౌన్సిల్‌ నుండి బయటకు వచ్చేసి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌)ను ఏర్పాటు చేసిన 32మంది సభ్యుల్లో శంకరయ్య ఒకరు. తమిళనాడులో ఐక్య పార్టీ ముఖ్య నిర్వాహకుల్లో ఆయన ఒకరుగా వున్నారు. తమిళనాడులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు. 1995 నుండి 2002 వరకు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వున్నారు. 1967, 77, 1980ల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1980ల్లో అసెంబ్లీలో సిపిఎం గ్రూపు నేతగా వున్నారు. రైతు ఉద్యమాన్ని అభివృద్ధిపరిచేందుకు కూడా ఆయన కృషి చేశారు. అనంతర కాలంలో అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడుగా పనిచేశారు.కమ్యూనిస్టు రాజకీయాలను, విధానాలను ప్రజలకు సమర్ధవంతంగా వివరించే మంచి వాగ్ధాటి గల మంచి వక్త అంతకుమించి అంకిత భావం, నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్‌ అని పొలిట్‌బ్యూరో తన సంతాప సందేశంలో పేర్కొంది. పార్టీకి పూర్తిగా అంకితమైన ఆయన ప్రజా జీవితంలో సమగ్రత, నిరాడంబరత వంటి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

➡️