- రాజ్యాంగానికి సవరణలు అవసరమే.. కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి
ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్
న్యూఢిల్లీ : రాజ్యాంగ నైతికత సిద్ధాంతాన్ని తిరస్కరించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుత సామాజిక ఆచరణ పద్ధతుల కారణంగా రాజ్యాంగ నైతికత ఉద్రిక్తతకు లోనవుతోందన్న కారణంతో దానిని తిరస్కరించడం తగని పని అని చెప్పారు. రాజ్యాంగ నైతికత ద్వారా భారతీయ సాంస్కృతిక పద్ధతులను పరిశీలించేటప్పుడు వైరుధ్యాలు తలెత్తే అవకాశంపై అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కొన్ని రాజ్యాంగ విలువలు ఆమోదయోగ్యమైనవని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు ఇతర దేశాలకు చెందిన రాజ్యాంగాల్లోని కొన్ని నిబంధనల్ని మన పరిస్థితులకు అనువుగా మార్చి భారత రాజ్యాంగంలో చేర్చారని వివరించారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మతం, కులం, జాతి కారణంగా పౌరులపై పెత్తనం చెలాయించేందుకు వీలు లేకుండా సామాజిక ఆచరణ పద్ధతుల్ని సంస్కరించాలని రాజ్యాంగమే చెబుతోందని అన్నారు.
అంటరానితనం నిర్మూలన, ప్రభుత్వ విధాన ఆదేశిక సూత్రాలు వంటి అనేక రాజ్యాంగ నిబంధనలు మన దేశంలో అందరికీ ఒకటేనని చంద్రచూడ్ చెప్పారు. ఉచిత న్యాయ సహాయం, పంచాయతీల ద్వారా స్థానిక పాలన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై చట్టాలు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వంపై ఉంచుతూ ఆదేశిక సూత్రాలను రూపొందించారని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాణం తర్వాత దానిని వందసార్లకు పైగా సవరించారని తెలిపారు. రాజ్యాంగ సవరణల ద్వారా మాత్రమే పంచాయతీలు, జిఎస్‌టి మండలి వంటి ప్రభుత్వ నిర్మాణాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాజ్యాంగం అనేది విలువలతో కూడిన పత్రమని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆ సూత్రాలను నిరంతరం సవరిస్తూనే ఉండాలని అభిప్రాయపడ్డారు.
న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం భిన్నత్వానికి ప్రాధాన్యత ఇచ్చిందని చంద్రచూడ్ అన్నారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థలో ఈ పద్ధతి మారుతోందని అంటూ అనేక రాష్ట్రాల్లో జరిగిన జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షల ఫలితాలను ఆయన ఉదాహరణగా చూపారు. పార్లమెంట్, న్యాయస్థానం వేర్వేరు సంస్థాగత నిర్మాణాలని, వాటికి వేర్వేరు అధికారాలు ఉన్నాయని చెప్పారు. ‘కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఉదాహరణకు పార్లమెంట్ సామాజిక మార్పుల కోసం బిల్లుల్ని ఆమోదిస్తుంది. అయితే హక్కుల ఉల్లంఘనకు సంబంధించి వ్యక్తిగత కేసులను అడ్డుకోవడానికి ఆ బిల్లుల్ని ఉద్దేశించలేదు. సమస్యల పరిష్కారానికి సంస్థాగత పాత్ర, సామర్ధ్యం ఆధారంగా పౌరులు తమకు నచ్చిన వేదికల్ని ఎంచుకోవచ్చు’ అని తెలిపారు. పార్లమెంట్, న్యాయ వ్యవస్థ తరచూ పరస్పరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలని చంద్రచూడ్ అన్నారు.