ఎన్నిక వాయిదా
జైపూర్ : రాజస్థాన్‌లోని కరణ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనెర్ బుధవారం అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 75 ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న గుర్మీత్ సింగ్‌ను ఈ నెల 12 నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గుర్మీత్ సింగ్ మృతితో ఈ నియోజవర్గంలో పోలింగ్ వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 52 ప్రకారం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీ అభ్యర్థి పోలింగ్‌కు ముందు మరణిస్తే ఎన్నికను వాయిదా వేస్తారు. ఏడు రోజుల్లోగా మరొక అభ్యర్థిని నామినేట్ చేయాలని సదరు పార్టీని ఇసి కోరుతుంది. గుర్మీత్ సింగ్ ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998, 2018లో కాంగ్రెస్ తరపున, 2008లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు.