ఆచారాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయండి

Nov 29,2023 11:40 #Manipur, #Supreme Court

  రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ :   మణిపూర్‌ హింసాకాండలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలకు త్వరగా అంత్యక్రియలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అంత్యక్రియలను నిర్వహించడానికి మృతుల బంధువులకు అనుమతించింది. మృతదేహాలను ఇంకా మార్చురీలో ఉంచడం సముచితం కాదని ధర్మాసనం పేర్కొంది. వారు (మృతులు) గౌరవప్రదమైన వీడ్కోలుకు అర్హులని పేర్కొంది. డిసెంబరు 4లోగా అంత్యక్రియలను నిర్వహించాలని ఆదేశించింది. మే 3 నుంచి జరిగిన మణిపూర్‌లో హింసాకాండలో మరణించిన 175 మంది మృతదేహాలను వివిధ మార్చురీల్లో భద్రపరిచారు. వాటికి అంత్యక్రియల విషయంలో వివాదం నెలకొంది. అంత్యక్రియలు చేసే ప్రాంతంపై కొన్ని పౌర సంఘాలు వివాదం రేపుతున్నాయి. ఈ అంశంపై పౌర సంఘాలకు ఎలాంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బంధువులు వారి మత అచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చునని తెలిపింది. అంత్యక్రియల్లో మూడో పక్షం జోక్యానికి తావులేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.

➡️