తోటి విద్యార్థిపై 108 సార్లు కంపాస్‌తో దాడి ..

Nov 27,2023 15:46 #compass, #CWC, #Madhya Pradesh

ఇండోర్‌ :   ఓ విద్యార్థిపై ముగ్గురు విద్యార్థులు జామెట్రీ బాక్స్ లోని  కంపాస్‌తో 108 సార్లు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వారంతా పదేళ్లలోపు వారేనని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నెల 24న జరిగిన ఈఘటనపై పోలీసుల నుండి బాలల సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) నివేదిక కోరడంతో సోమవారం వెలుగులోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వివరాల ప్రకారం.. గతవారం ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థుల మధ్య చిన్న పాటి ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆ విద్యార్థిపై విచక్షణా రహితంగా 108 సార్లు దాడి చేశారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు ఏరోడ్రోమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ వివేక్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. విద్యార్థులంతా పదేళ్లలోపు వారేనని అన్నారు. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

గత శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని విద్యార్థి తండ్రి తెలిపారు. విద్యార్థి శరీరంపై గాయాలు ఉన్నాయని అన్నారు. అయితే తోటి విద్యార్థుల తన కుమారుని ఎందుకు హింసించారో తెలియదని, పాఠశాల యాజమాన్యం కూడా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదిలోని సిసిటివి ఫుటేజీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ఈ కేసు షాక్‌కు గురిచేసిందని సిడబ్ల్యుసి చైర్‌పర్సన్‌ పల్లవి పొర్వాల్‌ పేర్కొన్నారు. ఇంత చిన్న పిల్లలు హింసాత్మకంగా ప్రవర్తించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు తామే పోలీసుల నుండి నివేదిక కోరామని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇస్తామని చెప్పారు. ఒక వేళ విద్యార్థులు హింసాత్మక దృశ్యాలతో నిండిన వీడియో గేమ్స్‌ చూస్తున్నారేమో తెలుసుకుంటామని అన్నారు.

➡️