కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారు
ఆ పై లైంగిక వేధింపుల కేసులో ఇరికించారు
అగ్రకుల పెత్తందారుల దాష్టీకం
న్యూఢిల్లీ : యుపిలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ దన్నుతో అగ్రకుల పెత్తందారుల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. జాన్పూర్ జిల్లాలో 14ఏళ్ళ దళిత బాలుడితో బలవంతంగా మూత్రం తాగించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అగ్ర కులానికి చెందిన థాకూర్లు దళిత బాలుడిపై దాడి చేసి కొట్టడమే కాకుండా, బలవంతంగా మూత్రం తాగించారు. అంతటితో ఆగలేదు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అతనిపై తప్పుడు కేసు బనాయించారు.. తమ కుమారుడిపై జరిగిన దారుణం గురించి ఫిర్యాదు ఇచ్చిన 33 నిముషాల వ్యవధిలోనే లైంగిక వేధింపుల అభియోగాలతో బాలుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆ బాలుడి తండ్రి మీడియా ముందు వాపోయాడు. కేసు పెట్టకుండా తమను అడ్డగించడానికే వారు ఇలా చేశారని చెప్పాడు. ఈ నెల 24న రాత్రి 7.30గంటల సమయంలో జాన్పూర్లోని సుజన్గంజ్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తన కుమారుడిపై తండ్రి కొడుకులు దాడి చేశారంటూ బ్రిజేష్ గౌతమ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని తీవ్రంగా కొడుతూ, కులం పేరుతో దుర్బాషలాడుతూ, ఒక గ్లాసులో పోసిన మూత్రాన్ని బలవంతంగా తాగించి, ఎడమ కనుబొమ్మను షేవ్ చేశారని గౌతమ్ తన ఫిర్యాదులో వివరించాడు, టాక్టర్తో తొక్కించేస్తానంటూ బెదిరించారని తెలిపాడు. మారుమూల ప్రాంతానికి ఈడ్చుకెళ్ళి, బాగా కొట్టి, నీట్లో తల ముంచి, నోటినిండా బురదతో నింపేశారని, తర్వాత వారు మూత్రం పోసి దాన్ని తన బిడ్డతో తాగించారని బాలుడి తాత మేవలాల్ గౌతమ్ చెప్పారు.