10, 12 తరగతి పరీక్షల్లోడివిజన్‌, డిస్టింక్షన్‌ ఇవ్వం : సిబిఎస్‌ఇ

Dec 2,2023 08:39 #cbse, #sillabus

న్యూఢిల్లీ : 10, 12 తరగతి పరీక్షల్లో డివిజన్‌, డిస్టింక్షన్స్‌ ఇకపై ఉండవని కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సిబిఎస్‌ఇ) శుక్రవారం తెలిపింది. మార్కుల శాతాన్ని కూడా పేర్కొనరాదని నిర్ణయించింది. ప్రతి సబ్జెక్టులో మార్కులను ఇచ్చే విధానాన్నే కొనసాగిస్తామని, అవసరమైతే ఉన్నత విద్యాసంస్థ, సంబంధిత యజమాని వాటిని లెక్కించుకోవచ్చునని సిబిఎస్‌ఇ తెలిపింది.’డివిజన్‌, డిస్టింక్షన్‌, మార్కుల మొత్తాన్ని ప్రకటించం. అలాగే, ఒక అభ్యర్థి ఐదు కంటే ఎక్కువ సబ్జెక్టులను ఎంచుకుంటే.. ఇందులో ఉత్తమమైన ఐదు సబ్జెక్టులనే అడ్మిషన్‌ పొందిన సంస్థ లేదా యాజమాని తీసుకోవచ్చు’ అని సిబిఎస్‌ఇ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యాం భరద్వాజ్‌ తెలిపారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం లేదా తెలియజేయడాన్ని సిబిఎస్‌ఇ చేయదని భరద్వాజ్‌ తెలిపారు. తదుపరి ఉన్నత విద్యకు లేదా ఉద్యోగంలో మార్కుల శాతం అవసరమైతే వాటిని ప్రవేశం పొందిన సంస్థ, యజమాని లెక్కించుకోవచ్చునని తెలిపారు. విద్యారంగంలో అనారోగ్య పోటీని నివారించడానికి సిబిఎస్‌ఇ గతంలోనే మెరిట్‌ లిస్టులను ఇచ్చే పద్ధ్దతిని నిలిపివేసింది. సిబిఎస్‌ఇ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్‌తోపాటు 26 దేశాల్లో 28 వేలకు పైగా సిబిఎస్‌ఇ అనుబంధ పాఠశాలలు ఉన్నాయి. గత సిబిఎస్‌ఇ 10వ తరగతి పరీక్షకు 21 లక్షలకు పైగా విద్యార్థులు, 12వ తరగతి పరీక్షకు 16 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు.

➡️