కొల్లాం : సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జి, తమిళనాడు మాజీ గవర్నర్ జస్టిస్ ఎం ఫాతిమా బీవి గురువారం తుది శ్వాస విడిచారు. 96 ఏళ్ల ఫాతిమా బీవి కేరళలోని కొల్లాంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. కేరళలోని పథనంథిట్ట జిల్లాలో 1927లో ఫాతిమా బీవి జన్మించారు. పిన్న వయస్సులోనే ఎల్‌ఎల్‌బి పూర్తి చేసిన ఘనత దక్కించుకున్న ఫాతిమా బీవి తరువాత చిన్న వయస్సులోనే మేజిస్ట్రేట్ అయిన ఘనత కూడా సాధించారు. తరువాత 1974లో జిల్లా సెషన్స్ జడ్జిగానూ, 1983లో కేరళ హైకోర్టు జడ్జిగానూ నియమితులయ్యారు. 1989లో సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జిగా నియమితులయ్యారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌లోనూ సభ్యులుగానూ ఆమె సేవలందించారు. ఫాతిమా బీవి మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. మలయాళ మహిళా అభ్యుదయ చరిత్రలో జస్టిస్ ఫాతిమా బీవి జీవితం మరిపోలేనిదనిపేర్కొన్నారు. కేరళ ప్రభ అవార్డుకు జస్టిస్ ఫాతిమా బీవిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు.