తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి
చెన్నై : రాజ్యాంగంపై సోషల్ ఆడిట్ జరగాలని, దానికి ఇదే సరైన సమయమని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తెలిపారు. దేశ రాజ్యాంగాన్ని కేవలం ఒక లీగల్ డాక్యుమెంట్ లేదా చట్టపరమైన వ్యక్తుల విశేషాధికారం అనుకునే స్థాయికి తగ్గించకూడదని గవర్నర్ అన్నారు. ‘రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత వరకూ నెరవేర్చింది. ఎందుకు నెరవేర్చలేకపోయింది. దీనిని తనిఖీ చేయడానికి సోషల్ ఆడిట్ జరగాలి’ అని గవర్నర్ తెలిపారు. రాజ్యంగ దినోత్సవం సందర్భంగా తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్శిటీ వద్ద జరిగిన ఒకరోజు కన్సార్టియంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యంగం రూపకల్పనకు దాని నిర్మాతలు ఎంతో కష్టపడ్డారని, ఈ విషయంలో అంబేద్కర్ సారథ్యంలోని రాజ్యాంగ పరిషత్‌కు కృతజ్ఞలమై ఉండాలని చెప్పారు. అయితే ఇది సంపూర్ణ పత్రం కాదనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. రవి చేసిన వ్యాఖ్యలను పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి తప్పుబట్టారు. దేశ రాజ్యాంగంపై సోషల్ ఆడిట్ జరగాలన్న రవి వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతలను అవమానించడమేనని విమర్శించారు. గవర్నర్ పదవికి రవి అర్హుడు కాదని అన్నారు.