యుపిలో దారుణాలు : మహిళపై గ్యాంగ్‌ రేప్‌-యువతి, తల్లిపై యాసిడ్‌ దాడి

యుపిలో దారుణాలు

లక్నో : బిజెపి పాలనలోని ఉత్తర్‌ ప్రదేశ్‌లో మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. బిజ్నోర్‌లో ఒక మహిళపై ఐదుగురు దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డగా, అయోధ్యలో ప్రేమకు అంగీకరించ లేదన్న కోపంతో యువతి, ఆమె తల్లిపై ఒక వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ సంఘటనలు పూర్తి వివరాలు.. బిజ్నోర్‌లో ఇటీవల ఒక వ్యాపారి ఇంటిని దోచుకోవడానికి వచ్చిన ఐదుగురు దొంగలు అతని భార్యను కట్టేసి గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడటమే కాకుండా సిగరెట్లతో దారుణంగా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. హార్డ్‌వేర్‌-పేయింట్‌ వ్యాపారం చేసే ఓ వ్యక్తి తన తల్లి, పిల్లలతో కలిసి మెడిసిన్స్‌ కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అల్మారాలను పగలగొట్టి బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, రూ. 1.5 లక్షల విలువైన నగదును దోచుకున్నారు. మహిళను ఓ గదిలో బంధించి ఇంట్లోని స్కూటర్‌ని తీసుకుని పరారయ్యారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఇంటి పైకప్పు నుంచి దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లు వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్యను కొట్టడంతో పాటు ఆమెను బంధించి, స్పహ తప్పేలా చేశారని, సామూహిక అత్యాచారం చేసి, సిగరెట్లతో కాల్చారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మహిళను వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మూడు టీంలతో నిందితులను పట్టుకునేందుకు వెతుకుతున్నట్లు ఎస్పీ రామ్‌ అర్జ్‌ తెలిపారు.
అయోధ్యలో ప్రేమకు అంగీకరించ లేదన్న కోపంతో యువతి, ఆమె తల్లిపై పొరుగున ఉండే 24 ఏళ్ల వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన వారిద్దరూ చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

➡️