న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, ఛత్తీ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 7:30 గంటల సమయానికి మధ్యప్రదేశ్‌లో 71:64 శాతం, ఛత్తీస్‌గఢ్ రెండో దశలో 68.15 శాతం పోలింగ్ నమోదయింది. ఓటర్ టర్నౌట్ యాప్ ద్వారా భారత ఎన్నికల సంఘం ఈ వివరాలను వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 6 గంటలకు, ఛత్తీస్‌గఢ్‌లో సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. ఈ సమయంలో క్యూలైన్‌ల్లో ఉన్నవారిని ఓటింగ్‌కు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని థమంతరి జిల్లాలో అత్యధికంగా 79.89 శాతం ఓటింగ్ నమోదు కాగా, రారుపూర్ జిల్లాలో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్‌లో షాజాపూర్ జిల్లాలో అత్యధికంగా 70.27 శాతం ఓటింగ్ నమోదు కాగా, రాజధాని భోపాల్‌లో అత్యల్పంగా 45.34 శాతం ఓటింగ్ నమోదయింది.
మధ్యప్రదేశ్‌లో…
ఇండోర్ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే మాలిని గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిపై ఇండోర్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మధ్యప్రదేశ్‌లో మెహగాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఒక వ్యక్తి గాలిలోకి కాల్పులు జరపడంతో బిజెపి అభ్యర్థి, ఆప్ మద్దతుదారుడు గాయపడ్డారు. చతర్‌పూర్ జిల్లా రాజ్‌నగర్ అసెంబ్లీ సిగ్మెంట్‌లో కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమ్‌సింగ్ నటిరాజా మాట్లాడుతూ తనపై ప్రత్యర్థి గ్రూపు వారు దాడికి పాల్పడ్డారని తెలిపారు. తాను హడావిడిగా కారులో వచ్చేశానని, తమ కార్యకర్త సల్మాన్‌ను కారుతో తొక్కించి హత్య చేశారని చెప్పాడు. దిమాని నియోజకవర్గంలోని 147, 148 పోలింగ్ బూత్‌ల వద్ద ఇరు గ్రూపులు పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డాయి. భద్రతా సిబ్బంది వెంటనే ఆ పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని, లాఠీఛార్జ్ చేసి ఇరు గ్రూపులను చెదరగొట్టారు. రాళ్ల దాడిలో ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఐఇడి పేలి జవాను మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌లో నక్సలైట్లు అమర్చిన ఐఇడి పేలి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)కు చెందిన ఒక జవాన్ మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. మొత్తం 2,533 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5,60,60,925 మంది ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలు ఉండగా, రెండో దశలో శుక్రవారం 70 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో తొలి దశలో ఈ నెల 7న 20 స్థానాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లోనూ డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ఓటింగ్ పూర్తికావడంతో మొత్తంగా మూడు రాష్ట్రాల్లో ఓటింగ్ పూర్తయింది. ఇంకా, రాజస్థాన్, తెలంగాణల్లో పోలింగ్ జరగాల్సి ఉంది.
మధ్యప్రదేశ్‌లో 15 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు
మధ్యప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు 15 శాతం పెరిగాయి. సోమవారం, బుధవారం అధిక స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 13న సుమారు 8,67,282 లీటర్ల మద్యాన్ని అమ్మినట్లు అధికారులు చెప్పారు. దీంట్లో విదేశీ లిక్కర్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత రోజుల్లో 9,17,823 లీటర్లు, 8,81,550 లీటర్ల మద్యాన్ని అమ్మారు.
ఓటు వేసిన వారికి.. ఉచితంగా పోహా, జిలేబీ పంపిణీ
ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రొత్సహించేందుకు ఒక స్వీట్ షాపు యజమాని చొరవచూపాడు. ఇండోర్‌కు చెందిన ఒక స్వీట్ షాప్ ఓనర్ ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకున్న వారికి పోహా, జిలేబీని ఉచితంగా పంపిణీ చేశాడు. వేలిపై సిరా మార్క్ చూపించిన వారికి వీటిని అందజేశాడు. ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ నమోదవుతుందని తాను భావిస్తున్నట్లు స్వీట్ షాప్ ఓనర్ శ్యామ్ శర్మ తెలిపాడు.