జైపూర్ : రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. గురువారం చురు జిల్లాలో చేపట్టిన ర్యాలీలో బిజెపిపై విరుచుకుపడ్డారు. రాజస్తాన్‌లో బిజెపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటికీ తిలోదకాలిస్తుందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒపిఎస్, ఆరోగ్య బీమా, రాయితీపై సిలిండర్, మహిళలకు ఏటా రూ.10వేల వంటి పథకాలన్నింటినీ బిజెపి నిలిపివేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నగదును బదిలీ చేస్తుంటే.. బిజెపి మాత్రం అదానీ విదేశాల్లో కంపెనీలు కొనేందుకు సహకరిస్తుందని దుయ్యబట్టారు. అదానీ ప్రభుత్వం కావాలా? లేదా రైతులు, కార్మికులు, యువత కోసం పనిచేసే ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం రాహుల్ గురువారం జైపూర్ ఎయిర్‌పోర్టు నుండి చురు జిల్లాకు వెళుతుండగా ఆసిక్తకరమైన ఘటన చోటుచేసుకుంది. రాహుల్ వెంట అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌లతో పాటు రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోట్సారాలు కన్పించారు. ఈ సందర్భంగా ”ముందు మీరు వెళ్లండి .. ముందు మీరు వెళ్లండి ” అంటూ ఒకరికొకరు ఆహ్వానిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. తామంతా కలిసి కన్పించడం కాదని, కలిసే ఉన్నామని అన్నారు. తామంతా ఐకమత్యంగా ఉన్నామని, కలిసికట్టుగా రాజస్తాన్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అన్నారు.