ఈరోడ్ : బిజెపి నాయకులు కేవలం దేశం పేరును మాత్రమే మార్చగలరని, దేశ ప్రజల స్థితిగతులను మార్చలేరని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈరోడ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ, నల్ల ధనాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తానని చెప్పారు. కానీ చేయలేదు. 2020కల్లా భారత్‌ను అగ్రరాజ్యంగా చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు 2047కల్లా అగ్రరాజ్యంగా మారుతుందని చెబుతున్నారు. భారత్‌ను మారుస్తానంటూ చెప్పారు. కానీ ఆయన కేవలం పేరును మాత్రమే మారుస్తున్నారు. 2024 ఎన్నికల్లో వీటన్నింటికీ మేం సమాధానం ఇవ్వాల్సి వుంది.” అని స్టాలిన్ పేర్కొన్నారు. బానిస పార్టీలన్నింటికీ బిజెపి మాస్టర్ అని వ్యాఖ్యానించారు. 2021లో తమిళనాడులో మేం బానిస పార్టీని ఓడించామని, అలాగే బిజెపిని కూడా పార్లమెంటరీ ఎన్నికల్లో ఓడిస్తామన్నారు. అన్నాడిఎంకెను ప్రస్తావిస్తూ, తమిళనాడు హక్కులన్నింటినీ అన్నాడిఎంకె ప్రభుత్వం త్యాగం చేసిందన్నారు. నీట్‌ను ఒకప్పుడు అనుమతించారు. కానీ జయలలిత హయాంలో నీట్ రాష్ట్రంలో అమలు కాలేదు. ఆమె చనిపోయిన తర్వాత అన్నాడిఎంకె అనుమతించిందన్నారు.