చెన్నై: ద్రోణి, ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కడలూరు, తిరునల్వేలి, మైలదుత్తరై, పెరంబలూరు, విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కడలూరు జిల్లాలో సెథియతోపె ప్రాంతంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.దక్షిణ థారు లాండ్ ను ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు (నవంబరు 27) దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఆగేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబరు 29 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థల వాతావరణ నమూనాలు వెల్లడిస్తున్నాయి.