న్యూఢిల్లీ : గతేడాది ప్రధాని మోడి పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి మరో ఆరుగురు పోలీసులను పంజాబ్ హోంశాఖ సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఫిరోజ్‌పూర్ జిల్లా ఎస్పీతోపాటు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్, ఎస్సై, ఏఎస్సై ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు రోజుల క్రితం అప్పటి ఫిరోజ్‌పూర్ (ప్రస్తుతం ఆయన బఠిండా ఎస్పీ) జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది. దీంతో మొత్తంగా ఏడుగురు పంజాబ్ పోలీసులపై వేటు పడింది. ఏం జరిగిందంటే.. గతేడాది జనవరి 5 న పంజాబ్‌లో ప్రధాని పర్యటించారు. బటిండా విమానాశ్రయంలో దిగిన ఆయన హెలికాప్టర్‌లో హుస్సేనివాలాకు వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్లాన్ మార్చుకొని రోడ్డు మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జోరువానలో రైతన్నలంతా ఫ్లై ఓవర్ ను దిగ్బంధించి నిరసన తెలుపుతున్నారు. అయితే వాతావరణం అనుకూలించలేదని నిర్ణయాన్ని మార్చుకొని ఆ ఫ్లై ఓవర్ పై వచ్చిన ప్రధాని కాన్వారు స్మారక చిహ్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగానే అన్నదాతల ఆందోళన చూసి ఆగింది. 20 నిముషాలపాటు కాన్వారు నిలిచింది. ప్రధాని కాన్వారు కు ఆటంకం కలగడం పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్రం నుండి తక్షణ నివేదికను కోరింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతేడాది జనవరి 12న సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన కమిటీ.. పోలీసుల విధి నిర్వహణలో లోపాలున్నట్లు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా పంజాబ్ హౌంశాఖ పోలీసు సిబ్బందిపై చర్యలు చేపట్టింది. గతేడాది ప్రధాని మోడి పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం కారణంగా.. మరో ఆరుగురు పోలీసులను పంజాబ్ హోంశాఖ సస్పెండ్ చేసింది.