జిన్‌పింగ్‌ నియంతే! : బైడెన్‌ మళ్లీ అదే పాట

Nov 18,2023 11:55 #Joe Biden, #Xi Jinping

వూడ్‌సైడ్‌ : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నియంతేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం పాత పాటే పాడారు. ఆ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకోలేనని తెలిపారు. ఇరువురు నేతలు సుదీర్ఘంగా ముఖాముఖి చర్చలు జరిపిన కాసేపటికే బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జిన్‌పింగ్‌తో సమావేశం ముగిసిన కొద్ది గంటల తర్వాత బైడెన్‌ విడిగా పత్రికా సమావేశం నిర్వహించారు. జిన్‌పింగ్‌ను ఇంకా నియంతగానే భావిస్తున్నారా అని ఒక విలేకరి ప్రశ్నించగా, ఆయన పైవిధంగా స్పందించారు. మన ప్రభుత్వానికి పూర్తి భిన్నమైన కమ్యూనిస్టు దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి ఆయన, అందువల్ల ఆయన నియంతే అని వ్యాఖ్యానించారు.

  • తీవ్రంగా ఖండించిన చైనా

బైడెన్‌ వ్యాఖ్యలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. బైడెన్‌ పేరును ప్రస్తావించకుండానే ఖండన వెలువడింది. ‘ఈ ప్రకటన ఆక్షేపణీయం, అభ్యంతరకరమే కాదు అత్యంత బాధ్యతారాహిత్యం, రాజకీయ వక్రీకరణలతో కూడుకున్నది’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ గురువారం విలేకర్లతో వ్యాఖ్యానించారు. కొంతమంది ఎప్పుడూ దుష్ట ఆలోచనలతోనే వుంటారని బైడెన్‌ను ఉద్దేశించి అన్యాపదేశంగా పేర్కొన్నారు.

➡️