లండన్ : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. మరోసారి విజృంభించేందుకు సిద్ధంగా ఉందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన బీఏ.2.86 వేరియంట్ లేదా పిరోలా ప్రస్తుతం బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. బహుశా ఈ వేరియంట్ ప్రభావం భారత్‌లో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకినవారు బాగా అలసటకు గురవుతారు. అలాగే నొప్పులు, జ్వరం, ముక్కుకారటం, గొంతునొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయని, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
కాగా, ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు బ్రిటన్‌లో అధికంగా నమోదవుతున్నాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్‌ఎస్‌ఏ) తెలిపింది. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా టీకాల ప్రచారాన్ని యూకేహెచ్‌ఎస్‌ఏ ముమ్మరం చేసింది. కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్ తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. గత జూలై నెలలో బీఏ.2.86 కేసులు నమోదయ్యాయి.