అమెరికా-రష్యా సంబంధాలు ఏ క్షణంలోనైనా తెగిపోవచ్చు : రష్యా

Nov 18,2023 11:48 #Joe Biden, #usa, #Vladimir Putin
మాస్కో : ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రష్యా – అమెరికా సంబంధాలు ఏ క్షణంలోనైనా పుటుక్కుమనిపోవచ్చని రష్యన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించబడి 90 ఏళ్లు అయిన సందర్భంగా రష్యన్‌ విదేశాంగ శాఖ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. ‘రష్యన్‌ ఫోబిక్‌ ‘ ను అమెరికా వీడనంతకాలం ఆ దేశంతో సంబంధాలు కష్టమే. సంబంధాలు తెగిపోతే దానికి బాధ్యత అమెరికానే. దాని బాధ్యతారాహిత్య వైఖరి, విద్వేషాలను రెచ్చగొట్టడం, రష్యాను వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభానికి అమెరికన్‌ పాలకవర్గాలు, వాటి మిత్రులే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ విమర్శించారు. ఆయన ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, పశ్చిమాసియా సంక్షోభం, ప్రాంతీయ ఘర్షణల వెనక అమెరికా, దాని మిత్రపక్షాల హస్తం ఉందన్నారు. అమెరికన్‌ పాలకవర్గాలు అమెరికా ప్రపంచాధిపత్యం కొనసాగాలని కోరుకుంటాయి. అందుకు నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలు, యుద్ధాలు జరిగేలా చూసుకుంటాయి. అవి లేకుంటే వాటికి లాభాలు రావు. వారి ప్రయోజనాలు నెరవేరవు. ఈ యుద్ధాలు, ఘర్షణల దుష్పరిణామాలు ప్రపంచ ప్రజలు అనుభవించాల్సి వస్తోంది. విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రపంచ ప్రజల మధ్య చీలిక తేవడం వంటి చర్యలు ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెడతాయి. ప్రపంచ అస్థిరత ఎంతగా పెరిగితే అమెరికన్‌ పాలకవర్గాలు, దాని మిత్రు లకు అంతగా లాభం. అందుకే అవి వీటిని ప్రేరేపి స్తుంటాయి. అయితే, వీరి పెత్తనం ఎంతో కాలం సాగ దు, ఇప్పటికే అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన పెరుగుతోంది అని పుతిన్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు

➡️