థాయిలాండ్ కేబినెట్ ఆమోదం
బ్యాంకాక్ : స్వలింగ సంపర్కుల వివాహాలను అనుమతిస్తూ పౌర, వాణిజ్య నిబంధనావళికి చేసిన సవరణను థాయిలాండ్ మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. వచ్చే నెల్లో ఈ ముసాయిదాను పార్లమెంట్‌కు అందచేయనున్నారు. సాధారణ జంటలు పొందుతున్న హక్కులనే స్వలింగ దంపతులు కూడా పొందేందుకు వీలుగా ‘స్త్రీ, పురుషులు, భార్యా, భర్తలు అనే పదాలను వ్యక్తులు, వివాహ భాగస్వాములుగా ప్రస్తావిస్తూ సివిల్, కమర్షియల్ కోడ్‌కు సవరణ చేసినట్లు ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి కరోమ్ వెల్లడించారు. స్వలింగ జాతుల వారైనప్పటికీ ఒక బంధాన్ని కొనసాగిస్తూ కుటుంబానిన ఏర్పాటు చేసే హక్కుకు ఈ చట్టం హామీ కల్పిస్తుందన్నారు. అలాగే స్వలింగ దంపతులను గుర్తిస్తూ వారికి పెన్షన్ ఫండ్ చట్ట సవరణను కూడా తేనున్నట్లు చెప్పారు. డిసెంబరు 12న ఈ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని శ్రేష్ట థావిసిన్ విలేకర్లకు తెలిపారు. పార్లమెంట్ ఆమోద ముద్ర, రాజు ధృవీకరణ పొందిన తర్వాత ఆసియాలో స్వలింగ సంపర్కుల వివాహాలను అనుమతించిన దేశంగా ఆసియాలో మూడవది కానుంది. ఇప్పటికే తైవాన్, నేపాల్‌లో ఈ వివాహాలను అనుమతిస్తున్నారు.