ఆగిన దాడులు

Nov 25,2023 10:26 #Attacks, #Gaza, #Stopped
  • అమల్లోకి కాల్పుల విరమణ
  • బందీల మార్పిడి షురూ !

గాజా : ఇజ్రాయిల్‌ , హమాస్‌ మధ్య కుదిరిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. హమాస్‌, ఇజ్రాయిల్‌ మధ్య కుదిరిన మొదటి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయం 7గంటల నుండి గాజాలో అమల్లోకి వచ్చింది. బందీల మార్పిడిలో భాగంగా తొలి రోజు హమాస్‌ 13మంది ఇజ్రాయిలీ బందీలను విడుదలచేసింది. దీనికి బదులుగా 39మంది పాలస్తీనియన్‌ రాజకీయ ఖైదీలను ఇజ్రాయిల్‌ విడిచిపెట్టింది. ఇరు పక్షాలు విడుదలైన బందీల జాబితాను పరస్పరం మార్చుకున్నాయని ఖతార్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఆహారం, మందులు, నీరు సహా గాజాకు మానవతా సాయాన్ని తీసుకుని దాదాపు 200 ట్రక్కులు బయలుదేరాయి. హమాస్‌ చెర నుండి విడుదలైన వారిలో 12మంది థాయి జాతీయులు వున్నట్లు థాయిలాండ్‌ ప్రధాని తెలిపారు. కాగా ఇప్పటివరకు గాజాపై యూదు దురహంకార నెతన్యాహు ప్రభుత్వం జరిపిన అమానుష దాడుల్లో 14,800మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో మూడింట రెండొంతుల మంది మహిళలు, పిల్లలే. గాజాలో జరిగిన విధ్వంసం, నష్టాన్ని అంచనా వేయడానికి ఈ కాల్పుల విరమణ దోహదపడుతుందని ఐక్యరాజ్య సమితి మహిళా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సిమా సామి బహౌస్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి సాయుధ ఘర్షణలు తలెత్తినపుడు అధికంగా మూల్యం చెల్లించేది మహిళలు చిన్నారులేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈజిప్ట్‌ నుండి గాజాకు ప్రతి రోజూ 1,30,000లీటర్ల డీజిల్‌, నాలుగు ట్రక్కుల గ్యాస్‌ వస్తుందని ఈజిప్ట్‌ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (ఎస్‌ఐఎస్‌) చైర్మన్‌ దియా రాష్వాన్‌ చెప్పారు.

➡️