జకార్తా : తక్షణమే గాజాలో యుద్దాన్ని ఆపాల్సిందిగా ఆసియాన్ దేశాల రక్షణ మంత్రులు పిలుపునిచ్చారు. గాజాలో మానవతా సాయం అందించేందుకు కారిడార్‌లను ఏర్పాటు చేయడంపై ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. మయన్మార్‌లో సుదీర్ఘంగా కొనసాగుతున్న అంతర్యుద్ధాన్ని ఎలా ఎదుర్కొనాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. దక్షిణ చైనా సముద్రంలో నౌకల రాకపోకల స్వేచ్ఛను పాటించాల్సిన ప్రాముఖ్యతను ఇక్కడ జరుగుతున్న ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల సమావేశం పునరుద్ఘాటించింది. వివాదాస్పద జలాల్లో ఘర్షణలను నివారించేందుకు అంతర్జాతీయ నిబంధననలు గౌరవించాలని కోరింది. ఈ మేరకు సంయుక్త డిక్లరేషన్‌ను వెలువరించింది.
10 దేశాలు సభ్యులుగా వున్న ఆసియాన్‌లో మయన్మార్ కూడా వున్నా, ఆ దేశ రక్షణ మంత్రిని ఈ వారం సమావేశాలకు రాకుండా నిషేధించారు. మయన్మార్‌లో హింసను అణచివేసేందుకు రూపొందించిన ఐదు పాయింట్ల శాంతి ప్రణాళికకు అనుగుణంగా వ్యవహరించడంలో మిలటరీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. మయన్మార్‌లో పరిస్థితులు క్షీణించడం పట్ల విచారం వ్యక్తం చేసింది. శాంతియుత, శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మయన్మార్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆసియాన్ దేశాలను ఇండోనేషియా కోరింది.