వాషింగ్టన్ : ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత నెల నుంచి జరుగుతోన్న భీకరపోరుకు కాల్పుల విరమణ రూపంలో తాత్కాలిక విరామం లభించింది. నిన్న ఉదయం నుంచి రెండువర్గాల మధ్య సంధి ప్రారంభమైంది. అలాగే హమాస్ చెరలో ఉన్న 24 మంది బందీలు విడుదలయ్యారు. దీనిపై జో బైడెన్ స్పందించారు. ”ఇది ప్రారంభం.. త్వరలో యుఎస్ పౌరులంతా విడుదలవుతారు” అని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య సంధిని పొడిగించే అవకాశాలు ”వాస్తవికమైనవి” అని స్పష్టం చేశారు. బందీలుగా ఉన్న యుఎస్ పౌరులు త్వరలో విడుదల చేయబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంధి నిబంధనల ప్రకారం… సంధి నిబంధనల ప్రకారం … ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాదిమంది ఖైదీలలో 150 మంది పాలస్తీనియన్ మహిళలు, పిల్లలకు బదులుగా 50 మంది మహిళలు, పిల్లల బందీలను నాలుగు రోజులలో విడుదల చేయాలి. రోజుకు 10 మంది చొప్పున ఎక్కువ మంది బందీలను విడుదల చేస్తే సంధిని పొడిగించవచ్చని ఇజ్రాయెల్ చెబుతోంది.
పాలస్తీనాను విముక్తి చేయండి అంటూ… నినాదాలు…. మసాచుసెట్స్ ద్వీపం నాన్‌టుకెట్‌లో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన బైడెన్ నిన్న విలేకరులతో సమావేశమయ్యారు. అనంతరం బైడెన్, అతని భార్య, జిల్ నాన్‌టుకెట్‌ను సందర్శిస్తుండగా.. అక్కడ గుమికూడిన కొందరు గుంపులో నుండి ”పాలస్తీనాను విముక్తి చేయండి!” అని బిగ్గరగా నినాదాలు చేశారు.
విలేకరుల సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ …. గాజాలో పోరాటం నాలుగు రోజులపాటు ఆగిపోతుంది అని చెప్పారు. సంధిని పొడిగించే అవకాశాలు నిజమైనవని భావిస్తున్నానన్నారు. హమాస్‌ను నిర్మూలించాలనే ఇజ్రాయెల్ లక్ష్యం చట్టబద్ధమైనది కానీ కష్టతరమైన మిషన్ అని బైడెన్ చెప్పారు. ఇది ఎంత సమయం పడుతుందో తనకు కూడా తెలియదన్నారు. అరబ్‌లు ఈ యుద్ధాన్ని నెమ్మదింపజేయడానికి, వీలైనంత త్వరగా ముగింపుకు తీసుకురావడానికి అన్ని వైపులా ఒత్తిడి తెచ్చారని బైడెన్ తెలిపారు.
యుద్ధానికే కాలుదువ్వుతున్న రెండు వర్గాలు… హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబూ ఉబైదా ఒక వీడియో సందేశంలో ఇది ”తాత్కాలిక సంధి” అని, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌తో సహా ”అన్ని ప్రతిఘటన రంగాలలో … ఘర్షణను పెంచాలి” అని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ కూడా ఈ తరహాలోనే పిలుపునిచ్చారు. పాజ్‌ను ”చిన్న” అని పిలిచారు. దాని ముగింపులో ”యుద్ధం లేదా పోరాటం గొప్ప శక్తితో కొనసాగుతుంది” అని చెప్పారు.