తుది దశలో వుందన్న ఖతార్
గాజా : హమాస్ చెరలో వున్న బందీల విడుదల, గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణకు సంబంధించి త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశముందని హమాస్ అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్, అమెరికా, ఖతార్ కలసి హమాస్‌తో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కీలకమైన, తుది దశలో వుందని కతార్ పేర్కొంది. మూడు నుండి ఐదు రోజుల పాటు కాల్పులకు తాత్కాలిక విరామం ప్రకటించే అవకాశం వుందని హమాస్ చీఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తర గాజాలోని అన్ని ఆస్పత్రులు మూతపడ్డాయని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దాడులు కొనసాగించడంతో నుస్రత్ శరణార్ధుల శిబిరంలో 20మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇప్పటివరకు 13,300మంది చనిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉత్తర గాజా తర్వాత ఇప్పుడు దక్షిణ ప్రాంతంపై బాంబు దాడులు జరుపుతున్నారంటే అక్కడ నుండి కూడా ప్రజలను వెళ్లగొట్టాలన్నదే ఇజ్రాయిల్ ఆలోచనగా వుందని ఈజిప్ట్ విమర్శించింది.
పాలస్తీనా శరణార్ధుల సంస్థకు భారత్ 25లక్షల డాలర్ల విరాళం
పాలస్తీనా శరణార్ధుల కోసం పనిచేసే ఐక్యరాజ్య సమితి సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ)కు 25లక్షల డాలర్లను భారత్ విరాళంగా అందజేేసింది. ఈ సాయాన్ని ఐరాస సంస్థ స్వాగతించింది. అందులో భాగంగా ఈ నెల 20న 25లక్షలను పాలస్తీనా ప్రతినిధి రేణు యాదవ్‌కు అందచేసినట్లు రమల్లాలోని భారత ప్రతినిధి కార్యాలయం తెలిపింది.
ఇజ్రాయిల్‌తో సహజీవనం కుదరదు
గాజాను దిగ్బంధించి, వేలాదిమంది అమాయకులను బలి తీసుకుంటున్న ఇజ్రాయిల్ దాష్టీకాలను ఉపేక్షించరాదని ఎక్కువ మంది పాలస్తీనియన్లు అభిప్రాయపడ్డారు. ఇజ్రాయిల్‌తో సహజీవనం అసాధ్యమని వెస్ట్ బ్యాంక్, గాజాల్లోని 98శాతం మంది పాలస్తీనియన్లు తేల్చి చెప్పారని రమల్లాకి చెందిన అరబ్ వరల్డ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. పాలస్తీనియన్లందరినీ లక్ష్యంగా చేసుకున్నారని 65శాతం మంది భావిస్తుంటే, ఇజ్రాయిల్, హమస్ మధ్య యుద్ధంగా కేవలం 18శాతం మందే చూస్తున్నారు. అక్టోబరు 7న హమస్ జరిపిన దాడులను 75శాతం మంది సమర్ధిస్తున్నారు. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి తమ మద్దతు లేదని 68శాతం మంది తిరస్కరించారు.
లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడి – నలుగురు మృతి
దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులతో సహా నలుగురు మరణించారని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. మీడియా నోరు నొక్కడమన్నదే ఇజ్రాయిల్ లక్ష్యంగా వుందని ఈ దాడి రుజువు చేసిందంటూ లెబనాన్ ప్రధాని నజీబ్ మికటి దాడిని ఖండించారు. ఏదో పొరపాటున జరిగిన దాడి కాదని, కావాలనే లక్ష్యంగా చేసుకుని జర్నలిస్టులను కాల్చి చంపారని అల్ మయదీన్ టివి డైరెక్టర్ వ్యాఖ్యానించారు. చనిపోయిన జర్నలిస్టులు ఇరువురు ఈ టివి చానల్‌లోనే పనిచేస్తున్నారు.