మయన్మార్ రెబెల్స్ వెల్లడి
నెపిడా : డజన్ల సంఖ్యలో మయన్మార్ భద్రతా బలగాలకు చెందిన సభ్యులు లొంగిపోయారని, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నామని రెబెల్స్ తెలిపారు. మరోపక్క దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ తిరుగుబాటు గ్రూపులు జుంటాతో సమన్వయంతో పోరాడుతున్నాయి. ఇప్పటివరకు 28మంది పోలీసులు వారి ఆయుధాలను విడనాడి అరకన్ ఆర్మీ (ఎఎ)కి లొంగిపోయారని, మరో పది మంది సైనికులను అరెస్టు చేశామని పశ్చిమ మయన్మార్‌లోని రాఖినె రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతున్న గ్రూపు బుధవారం తెలిపింది. మూడు మైనారిటీ గ్రూపులు కలిసి జుంటాపై అక్టోబరు చివరి నుండి పోరాడుతున్నాయి. అందులో ఎఎ ఒకటి. మయన్మార్ ఘర్షణలతో ఇప్పటివరకు 2లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. చైనా సరిహద్దుకు సమీపంలోని ఉత్తర షాన్ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 27న పోరాటం ఉధృతమైంది. మూడు తిరుగుబాటు గ్రూపులు కలిసి మయన్మార్ మిలటరీపై దాడులు ఆరంభించాయి. చైనాకు వెళ్లే మూడు కీలకమైన వాణిజ్య మార్గాలను ఈ కూటమి నిరోధించింది. సరిహద్దు కేంద్రాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. 2021 తర్వాత జుంటాకు ఎదురైన అతిపెద్ద సైనిక సవాలు ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు.