శిథిలాల మధ్య కుళ్లిన మృతదేహాలతో దుర్గంధం
ఏడవ రోజూ కొనసాగిన బందీల విడుదల
గాజాకు మరింత సాయం పంపాలని జోర్డాన్ వినతిరఫా,
గాజా : కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ గాజా ప్రజలు భయం, భయంగానే బతుకు వెళ్లదీస్తున్నారు. గురువారం ఆరవ విడత విడుదలలో భాగంగా పదిమంది ఇజ్రాయిలీ బందీలు గాజా నుండి విడుదల కానున్నారు. వారిలో ఇరువురు రష్యన్ పౌరులు. గత వారం రోజులుగా 200మందికి పైగా పాలస్తీనియన్లు విడుదలైనా ఇంకా వేలాదిమంది ఇజ్రాయిల్ జైళ్లల్లో మగ్గుతున్నారు. బుధవారం కాల్పుల విరమణ గడువు మరికొద్ది నిముషాల్లో ముగిసిపోతుందనగా ఒక రోజు పొడిగింపునకు ఇరు పక్షాలు అంగీకరించాయి. భవన శిధిలాల కింద కూరుకుపోయిన శవాలు కుళ్లిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నట్లు అల్‌జజీరా వార్తా సంస్థ తెలిపింది.
కాల్పుల విరమణ కొనసాగించండి : బ్లింకెన్
గాజాలో ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణ హౌమాన్ని ఆపాలని కోరుతూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో సహా యావత్ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కాల్పుల విరమణను మరి కొంత కాలం కొనసాగించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం టెల్ అవీవ్‌లో పర్యటిస్తున్న ఆయన నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇజ్రాయిల్ తదుపరి కార్యాచరణకు సంబంధించి మార్గ నిర్దేశం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరింత సాయం అందేలా చూడండి -ఐరాసకు జోర్డాన్ రాజు అబ్దుల్లా విజ్ఞప్తి
కాల్పుల విరమణ సమయంలో గాజాకు మానవతా సాయం మరింత అందేలా చూడాలని జోర్డాన్ రాజు అబ్దుల్లా ఐక్యరాజ్య సమితి సహాయక కార్యకలాపాల నిర్వహణ అధికారులను, అంతర్జాతీయ ఎన్జిఓలను కోరారు. ఈ మేరకు ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచాలన్నారు. ఐక్యరాజ్య సమితి అధికారులు, పశ్చిమ దేశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల అధినేతలు, అరబ్ దాతల ప్రతినిధులతో అత్యవసరంగా జరిపిన సమావేశంలో అబ్దుల్లా మాట్లాడారు. తగినంత మొత్తంలో ఆహార సరఫరాలు అందకుండా ఇజ్రాయిల్ తొక్కిపడుతోందని, ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ఖతార్ అమీర్‌కు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా కృతజ్ఞతలు తెలియజేశారు.